కాశ్మీర్ లోయను ఖాళీ చేస్తున్న హిందువులు.. కాశ్మీర్ లోయలో మేము బ్రతకలేము అంటు ప్రయాణం…!!

కాశ్మీర్‎లో టార్గెటెడ్ కిల్లింగ్స్ జరుగుతున్నాయి. హిందూ పండిట్లు, ప్రభుత్వ ఉద్యోగులను ఏరి మరీ చంపుతున్నారు పాక్ టెర్రరిస్టులు. తాజాగా రాజస్థాన్ కు చెందిన విజయకుమార్ అనే ఓ బ్యాంక్ ఉద్యోగిని కుల్గామ్ లో కాల్చి చంపారు. వరుస హత్యలతో హిందూ కుటుంబాలు భీతిల్లుతున్నాయి. ప్రభుత్వ రక్షణ ఏర్పాట్లపై విశ్వాసం సడలింది. దీంతో వారు కాశ్మీర్ లోయను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు…కాశ్మీర్‎లో ఉగ్రమూకను ఏరివేస్తున్న బలగాల ఆపరేషన్లు హిందూ కుటుంబాల్లో భరోసా నింపలేకపోతున్నాయి. కళ్లముందే జరుగుతున్న వరుస హత్యలతో వారి ఆత్మవిశ్వాసం సడలుతోంది. కాశ్మీర్ లో ఉండి బతకడం అనేది వారికి దుర్లభంగా కనిపిస్తోంది. అందుకే సురక్షితమైన ప్రాంతాలకు పయనమవుతున్నారు. పిల్లా జెల్లా, తట్టా బుట్టా సర్దుకొని ప్రాణాల మీద తీపితో కాశ్మీర్ లోయను వీడి జమ్మూ రీజియన్ కు తరలిపోతున్నారు. బారాముల్లాలోని ఒకే ప్రాంతంలో ఉండే దాదాపు 350 కుటుంబాల నుంచి 100కు పైగా ఇప్పటికే ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇంకా చాలా మంది వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు. దీంతో ఇన్నాళ్లూ అక్కడే మొండిధైర్యంతో ఉన్నవాళ్ల హృదయాల్లోనూ అనుమానాలు రేగుతున్నాయి. తాము కూడా వెళ్లిపోక తప్పదన్న భావనలోకి వెళ్లిపోతున్నారు. దీంతో ప్రభుత్వం తలపెట్టిన ఏరివేత ఆపరేషన్ ఉద్దేశం నెరవేరకుండా పోతుందా అన్న అనుమానాలు రేగుతున్నాయి…