హిజ్రాగా మారి వేధిస్తున్నాడనీ.. రూ.18 లక్షలు సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య

హిజ్రాగా మారి వేధిస్తున్న భర్తను సుపారీ ఇచ్చి మరీ ఓ భార్య హత్య చేయించింది. గత నెలలో రూ.18 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్న భార్య.. తొలుత రూ.4.60 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చింది. ముందుగా పన్నిన పన్నాగం ప్రకారం తన ఇంట్లోనే భర్తను చంపించింది. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆల్యంగా వెలుగు చూసింది. నిందితురాలితో సహా ముగ్గురిని సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీసులు శనివారం (జనవరి 6) రిమాండ్‌కు తరలించారు. సిద్దిపేట వన్‌టౌన్‌ సీఐ కృష్ణారెడ్డి, ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

సిద్దిపేట బోయిగల్లీకి చెందిన వేదశ్రీకి నాసర్‌పురా వీధికి చెందిన దరిపల్లి వెంకటేశ్‌ (33)తో 2014లో పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. 2015లో వీరికి ఓ పాప జన్మించింది. ఆ తర్వాతి నుంచి భార్యను అదనపు కట్నం కోసం వేధింపులు ప్రారంభించాడు. అంతేకాకుండా కొద్ది రోజులుగా అతని ప్రవర్తలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. చెవులకు కమ్మలు, ముక్కు పుడక పెట్టుకుని రాత్రిళ్లు ఆడవారి దుస్తులు ధరించడం చేస్తుండేవాడు. 2019లో ట్రాన్స్‌జెండర్‌గా మారిన అతను తన పేరును కూడా రోజాగా మార్చుకున్నాడు. భర్త హిజ్రాగా మారాడన్న విషయం తెలుసుకున్న వేదశ్రీ గత ఏడేళ్లుగా భర్తకు దూరంగా వేరుగా ఉంటోంది. అంతేకాకుండా కుమార్తెను తనకు ఇవ్వాలంటూ భార్యను వేధించేవాడు. పలుమార్లు చీరకట్టుకుని వెళ్లి వేదశ్రీ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న ప్రైవేటు పాఠశాల వద్దకు వెళ్లి ఇబ్బందులకు గురిచేసేవాడు. దీంతో ఆమె ఉద్యోగం కోల్పోయింది. మరో స్కూల్‌లో చేరినా అదే పరిస్థితి. ఈ క్రమంలో పట్టణానికే చెందిన బోయిని రమేశ్‌తో గత కొంతకాలంగా వేదశ్రీ సన్నిహితంగా ఉంటోంది. అతనితో కలిసి వెంకటేశ్‌ (రోజా) అడ్డు తొలగించుకునేందుకు పథకం పన్నింది.

దీంతో వేదశ్రీ, రమేశ్‌ కలిసి పట్టణంలోని కాకతీయ ఫుట్‌వేర్‌ వ్యాపారి రమేశ్‌తో వెంకటేశ్‌(రోజా) హత్య కోసం 2023 సెప్టెంబర్‌లో రూ. 18లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండు విడతల్లో రూ.4.60 లక్షలు ముట్టజెప్పారు. ఈ క్రమంలో ఫుట్‌వేర్‌ రమేశ్‌కు మిత్రుడైన నంగునూరు మండలం నాగరాజుపల్లికి చెందిన ఇప్పల శేఖర్‌కు హత్య విషయం తెలిపారు. పథకంలో భాగంగా వెంకటేశ్‌ (రోజా)తో ఇప్పల శేఖర్‌ పరిచయం చేసుకుని తరచూ అతడిని కలుస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇప్పల శేఖర్‌ వెంకటేశ్‌(రోజా)కు ఫోన్‌ చేసి వరంగల్‌ నుంచి సిద్దిపేటకు పిలిపించాడు. గత ఏడాది డిసెంబరు 11న నాసర్‌పురాలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వెంకటేశ్‌(రోజా)కు ఇప్పల శేఖర్‌ మద్యం తాగించాడు.
మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్‌(రోజా)ను మరో ఇద్దరు వ్యక్తుల సాయంతో దిండుతో ఊపిరాడకుండా చేసి హతమార్చారు. వెంకటేశ్‌(రోజా) మృతి చెందిన విషయం బయటికి పొక్కడంతో అప్పట్లో వన్‌టౌన్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టంలో వెంకటేశ్‌(రోజా)ది హత్యగా నిర్ధారణ కావడంతో పోలీసులు దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలు సేకరించారు. హత్యలో వేదశ్రీతో పాటు మరో అయిదుగురి పాత్ర ఉందని పోలీసులు తేల్చారు. ప్రధాన నిందితురాలు వేదశ్రీతోపాటు బోయిని రమేశ్‌, ఇప్పల శేఖర్‌లను పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.