తుంగభద్ర జలాశయానికి స్వల్ప వరద ఆయకట్టు రైతుల్లో ఆశలు..!

వరదనీటి రాకతో నిండుకుండలా జలాశయం..

*తుంగభద్రకు జలకళ*..

వర్షాలు మందగించడంతో రైతుల సేద్యం కొంత వెనకబడుతున్న తరుణంలో ప్రస్తుతం తుంగభద్ర జలాశయానికి(tungabhadra river) వరదరావడంతో రైతుల ఆశలు చిగురించాయి.. తుంగభద్ర జలాశయానికి రోజురోజుకు వరద నీరు చేరిక పెరగుతుండడంతో జలకళ సంతరించుకుంది. గత వారం వరకు డెడ్‌ స్టోరేజ్‌తో కళతప్పిన తుంగభద్ర జలాశయానికి ఇపుడిపుడే వరద నీరువచ్చి చేరుతుండంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు పెరుగుతున్నాయి.

జలాశయం పైభాగం ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో పై భాగంలోని తుంగ, భద్ర జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. ఈ రెండు జలాశయాల నుంచి దిగువకు నీరు వదులుతుండడంతో తుంగభద్రకు రోజు రోజుకు వరద నీటి చేరిక పెరుగుతోంది.ప్రస్తుతం జలాయశానికి 15,800 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు జలాశయం అధికారులు తెలిపారు. మంగళవారం ఒక్కరోజే 3.91 టీఎంసీలు నీరు చేరింది. ప్రస్తుతం జలాశయంలో 6.98 టీఎంసీ(TMC) నీరు ఉంది. గత ఏడాది ఇదే సమయానికి జలాశయం పూర్తి స్థాయిలో నిండడంతో భద్రతా దృష్ట్యా దిగువకు వరద నీటిని వదిలారు. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడం ప్రారంభించడంతో జలాశయానికి నీటి చేరిక ఆలస్యంగా జరుగుతోందని తుంగభద్ర బోర్డు అధికారులు చెబుతున్నారు.