నేటి నుంచి బీఆర్‌ఎస్‌ సమావేశాలు..!

*నేటి నుంచి బీఆర్‌ఎస్‌ సమావేశాలు…
లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం
నియోజకవర్గాల వారీగా
నేతలతో సమావేశం
ఆదిలాబాద్‌తో ప్రారంభం

లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ సన్నద్ధమవుతున్నది. గెలుపే లక్ష్యం గా అనుసరించాల్సిన వ్యూ హంపై చర్చించడానికి లోక్‌సభ నియోజకవర్గాల వారీగా బుధవారం నుంచి సన్నాహాక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణభవన్‌లో పార్టీ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు, పార్టీ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు, పార్టీ నేతలు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మధుసూధనాచారి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి తదితర ముఖ్యనాయకులు సమావేశాలను నిర్వహించనున్నారు. రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. మొదటి విడతలో జనవరి 3 నుంచి 12 వరకు నిర్వహిస్తారు.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో మూడురోజుల విరామమిస్తారు. తిరిగి జనవరి 16 నుంచి మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు కొనసాగిస్తారు. మొదట ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఒక లోక్‌సభ నియోజకవర్గం నాయకులతో సమావేశమై, పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూ హంపై చర్చిస్తారు. మీటింగ్‌కు హాజరయ్యే ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని కార్యాచరణను రూపొందిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సమావేశాలకు ఆయా లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలందరినీ ఆహ్వానించారు. ఎంపీలు, నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సమావేశాలకు హాజరుకానున్నారు.

సన్నాహాక సమావేశాల తేదీలు…

జనవరి 3న ఆదిలాబాద్‌, 4న కరీంనగర్‌, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్‌, 8న జహీరాబాద్‌, 9న ఖమ్మం, 10న వరంగల్‌, 11న మహబూబాబాద్‌, 12న భువనగిరి, 16న నల్లగొండ, 17న నాగర్‌కర్నూల్‌, 18న మహబూబ్‌నగర్‌, 19న మెదక్‌, 20న మలాజిగిరి, 21న సికింద్రాబాద్‌, హైదరాబాద్‌…