నేడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.!!?…

నేడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన…

అభ్యర్థుల ఎంపికపై పూర్తైన కసరత్తు…

టిపిసిసి అధ్యక్షుడు, సిఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు ముందు ఏఐసిసి నేతలతో భేటీ….

ఎమ్మెల్యే కోటాలో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్,అద్దంకి దయాకర్, పటేల్ రమేష్ రెడ్డి, మరికొంత మంది పేర్లు పరిశీలన…….

రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలు దఫాలు ఏఐసీసీ నేతలతో అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అద్దంకి దయాకర్, మహేశ్‌కుమార్ గౌడ్, చిన్నారెడ్డి, షబ్బీర్ ఆలీ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో కీలక నేతలతో చర్చించిన సీఎం ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను వారికి అందించినట్లు రాష్ట్ర పార్టీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. ఇందులో ఇద్దరిని ఖరారు చేసే బాధ్యతను ఏఐసీసీ తీసుకున్నది. దయాకర్, మహేశ్‌కుమార్ పేర్లను ఫైనల్ చేసే అవకాశమున్నదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ అవకాశం రానివారికి కేబినెట్ హోదా లేదా దానికి తగిన స్థాయి ఉన్న కార్పొరేషన్లకు చైర్మన్‌లుగా చేస్తామని హామీ ఇచ్చేలా పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నది. ఈ రెండు స్థానాలకు ఈ నెల 29న ఎన్నిక జరగనున్నది.

గవర్నర్ కోటాపైనా ఉత్కంఠ..

అంతేకాకుండా గవర్నర్ కోటాలో రెండు స్థానాలను భర్తీ చేసే వీలున్నది. ఒక స్థానంలో ప్రొఫెసర్ కోదండరాం (అకాడమిక్ కేటగిరీ), మరో స్థానంలో మైనారిటీని ఎంపిక చేయాలని భావిస్తోంది. నామినేటెడ్ కోటా కావడంతో జర్నలిజం లేదా విద్యాసంస్థల నిర్వహణ రంగాలలో అనుభవం ఉన్న అమీర్ అలీ (సియాసత్ ఉర్దూపత్రిక ఎడిటర్ దివంగత జహీర్ ఆలీ ఖాన్ కుమారుడు) లేదా ముఫకంజా విద్యాసంస్థల నిర్వాహకుడు జాఫర్ జావీద్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నది. మస్కతీ ఐస్ క్రీమ్స్ అధినేత మస్కత్ ఆలీని ప్రతిపాదించాలని భావించినా ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నామినేటెడ్ కోటాలో ఇబ్బంది వచ్చే అవకాశమున్నదని పార్టీ భావిస్తున్నది.

ప్రస్తుతం మంత్రివర్గంలో మైనారిటీ కోటా నుంచి ఎవ్వరూ లేనందున తొలుత షబ్బీర్ అలీని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా చేసి కేబినెట్‌లోకి తీసుకోవాలనే చర్చలు పార్టీలో జరిగాయి. కానీ గతంలో పలుమార్లు ఓడిపోయినందున పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వస్తోందని, గతంలో చేసుకున్న తీర్మానాలను ఉల్లంఘించినట్లు అవుతుందనే అభిప్రాయాలూ వచ్చాయి. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, పార్టీలో సీనియారిటీ ఉన్నందున ఇప్పుడు కేబినెట్‌లో చోటు కల్పించడం ఉపయోగకరంగా ఉంటుందనే భావన ఉన్నందున ఏఐసీసీ ఆచితూచి వ్యవహరిస్తున్నది…

గవర్నర్ కోటాలో టిజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్,సియాసత్ ఎడిటర్ అమేర్ అలీఖాన్ పేర్లు పరిశీలన…

ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల చివరి తేదీ దగ్గర పడడంతో నేడు ఏఐసిసి ప్రకటన చేసే అవకాశం..