నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం..

*నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి భాష అనేది ఉపయోగపడుతుంది. అమ్మ ఒడిలో పల్లె బడిలో నేర్చుకున్న నా మాతృభాష తెలుగు భాష సహజ సిద్ధమైన స్వచ్ఛమైన జానపద సాహిత్యము ఆట వెలదులు కందాలు తేటగీతి పద్యాలతో పరిమళించే తేనెలూరు భాష నా తెలుగు భాష.
అమ్మ భాష అమృతంలోని మాధుర్యాన్ని తేనెలోని తీయదనాన్ని పువ్వులోని పరిమళాన్ని సన్నజాజి సంపంగిలోని సొగసులను వెన్న జున్ను నెమలి కన్ను చందమామ వెన్నెలలోని అందాలతో అలరారుతున్న భాష మాతృభాష. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాష ప్రాధాన్యతను తెలుసుకుంటూనే మాతృభాష యొక్క చారిత్రిక నేపథ్యాన్ని కూడా తెలుసుకోవలసిన ఆవశ్యకత నేటి ప్రపంచంలోని యువతకు ఎంతో అవసరం.ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ”అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం”జరుపుకుంటారు. 1999 ఫిబ్రవరి 21న యునెస్కో ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. 2000 ఫిబ్రవరి 21 నుండి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.ఈ దినోత్సవం బంగ్లాదేశీయులు (అప్పటి తూర్పు పాకిస్తానీయులు) చేసిన భాషా ఉద్యమానికి నివాళిగా జరుపుకుంటారు. 1952 ఫిబ్రవరి 21న డక్కా విశ్వవిద్యాలయంలో ఉర్దూతో పాటు బెంగాలీని కూడా అధికారిక భాషగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తూ భారీ నిరసనలు జరిగాయి. ఈ ఉద్యమంలో పాల్గొన్న పలువురు విద్యార్థులు పోలీసు కాల్పుల్లో మరణించారు.

ఈ దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యం ప్రపంచంలోని అన్ని భాషలను గౌరవించడం, వాటి వైవిధ్యాన్ని కాపాడడం. భాష ఒక సంస్కృతికి చాలా ముఖ్యమైనది. ఒక భాషను కోల్పోవడం అంటే ఒక సంస్కృతిలోని ఒక భాగాన్ని కోల్పోవడమే. ప్రపంచంలో దాదాపు 6000 భాషలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు చిన్న భాషలు. ఈ భాషలు కనుమరుగు అయ్యే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఈ భాషలను కాపాడడానికి ఒక అవగాహన కల్పించడంలో సహాయపడుతుంది. మాతృభాష మనకు చాలా ముఖ్యమైనది. మనం మన మాతృభాషను గౌరవించాలి, దానిని కాపాడాలి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఈ దిశగా ఒక మంచి అవకాశం. మన మాతృభాషలో మాట్లాడటానికి ప్రయత్నించాలి. మన పిల్లలకు మన మాతృభాష నేర్పించాలి.మన మాతృభాషలో పుస్తకాలు చదవాలి.మన మాతృభాషలో సినిమాలు చూడాలి. మన మాతృభాష సంస్కృతిని గౌరవించాలి.

భాషను శ్వాసగా చేసుకొని సాహిత్యములోని కథ కవిత నవల పద్యం నాటకము ఇలా వివిధ రూపంలో ఎందరో తెలుగు రచయితలు తమదైన శైలిలో తెలుగు సాహిత్యాన్ని రాస్తూ మన ముందుకు తీసుకొస్తున్నారు మన తెలుగు సాహిత్యాన్ని చదువుతూ తెలుగు భాషను అభిమానిస్తూ ఆదరిస్తూ ఉండాల్సిన అవసరం నేటి ప్రపంచంలోని ప్రతి ఒక్క తెలుగువారిపై ఉంది ప్రపంచంలో 16వ స్థానంలో ఉన్న తెలుగు భాష నానాటికి అంతరించిపోతున్న దశలో ఉందని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భాష మేధావులు పేర్కొనటం మనకి కాస్త బాధాకరమైనప్పటికీ మన భాషను బ్రతికించుకోవలసిన అవసరము ఆవశ్యకత తెలుగు ప్రజలు అందరిపై ఆధారపడి ఉంది కాబట్టి తెలుగు సాహిత్యాన్ని కవిత్వాన్ని ప్రోత్సహిస్తూ నేటి విద్యార్థినీ విద్యార్థుల చేత తెలుగులో కథలు కవితలు, రాయిస్తూ భాష మీద అభిమానాన్ని పెంపొందించాల్సిన అవసరము ఆవశ్యకత తల్లిదండ్రుల మీద ఉపాధ్యాయుల మీద నేటి వాట్సాప్‌ యూట్యూబ్‌ ఛానల్స్‌ మీద కూడా ఆధారపడి ఉంది కాబట్టి ప్రతి ఒక్క తెలుగువారు తెలుగు భాషని ఆదరించి తెలుగు భాష యొక్క ఆవశ్యకతను ప్రపంచానికి తెలియజేయవలసిన అవసరము ఉంది ప్రపంచంలో ఏ భాషలో లేని పద్య సాహిత్యము తెలుగు భాషలో ఉండటం ఎంతో గర్వకారణం కాబట్టి మనం మాతృభాష అయినా తెలుగును కాపాడుకుందాం. తెలుగులోనే మాట్లాడుకుందాము తెలుగుజాతి వెలుగుని ప్రపంచానికి ప్రసరింప చేద్దాము ”తెలుగు ప్రజలందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు”.