విద్య పరమార్ధం ఏమిటి?…నేటి కథ….

నేటి కథ.
*విద్య పరమార్ధం ఏమిటి?*

*‘విద్యలేని వాడు వింత పశువు’ అన్నారు పెద్దలు.*

*అసలు విద్యంటే ఏది? దాని పరమార్ధం ఏమిటి?*

*పశువు స్థాయినుండి మనిషిగా రూపాంతరం చెందించే ఆ ‘విద్య’ ఏమిటి?*

*ఫ్యాషన్ పేరిట కురచదుస్తులతో శరీరప్రదర్శనలూ, మత్తుపదార్ధసేవనం వల్ల తూలిన ప్రవర్తనలతో మనిషి ఏ ‘స్థాయి’కి పరిణమిస్తున్నాడు?*

*ఆ స్థాయికి తీసికెళ్ళెదాన్ని ‘విద్య’ అనాలా, ‘అవిద్య’ అనాలా?*

*ఆదిమానవుడు, ప్రకృతిలోని శీతోష్ణస్థితుల నుండి శరీరాన్ని కాపాడు కునేందుకు కవచంగా దుస్తుల్ని కనుగొని ధరించాడు. క్రమంగా శరీరాన్ని కప్పుకోవడంలో సభ్యతనీ, సంస్కారాన్ని గుర్తించగలిగాడు. కాబట్టే జంతుస్థాయినుండి వేరుపడ్డాడు. గుహల నుండి గృహ నిర్మాణాల దాకా పయనించాడు. అది పురోగమనం.*

*మనిషిని జంతుస్థాయి నుండి వేరు చేసింది ‘విద్య’.*

*అయితే నేడు?*

*విద్యకు పరమార్ధం ఉద్యోగం.*

*విద్యకు చివరి గమ్యం ఉపాధి.*

*చదువుకునేది డబ్బు సంపాదన కోసమే.*

*ఒకసారి ఉద్యోగమో, ఉపాధో సంపాదిస్తే ఇక అక్కడితో చదువుకోవటానికి, విద్యా సముపార్జనకీ పుల్ స్టాఫ్ పడుతుంది. ఇదేనా చదువంటే? ఇదేనా విద్యంటే?*

*ప్రతి పిల్లీ, తన కూనలకి ఎలుకలని ఎలా వేటాడాలో నేర్పుతుంది.*

*ప్రతి కోతీ, తన పిల్లలకి ఇళ్ళ పెరళ్ళల్లోకి చెట్లమీది జామకాయలూ, మామిడికాయలూ ఎలా తెంపుకోవాలో, ఇంటి వాళ్ళు వెంటపడి రాళ్ళు విసిరితే ఎలా తప్పించుకోవాలో నేర్పుతుంది.*

*అలాగే మనమూ మన పిల్లలకి [ఉద్యోగమో, ఉపాధి] జీవన భృతి సంపాదించుకునే విద్యని నేర్పుతున్నాం. అంతే!*

*ఒకప్పుడు కుటుంబవృత్తులుండేవి. ఓ రైతు బాలుడు తన తండ్రి, తాతల దగ్గర వ్యవసాయపు మెళకువలు నేర్చుకునేవాడు. అందుకు ఫీజులు అక్కర్లేదు, సర్టిఫికేట్లు అక్కర్లేదు. ఓ అమ్మాయి తన అమ్మ, అమ్మమ్మల దగ్గర హౌస్ కీపింగ్, ఛైల్డ్ కేరింగ్ నేర్చుకునేది. దానికీ ఫీజులు అక్కర్లేదు, సర్టిఫికేట్లు అక్కర్లేదు.*

*ఓ వడ్రంగి, ఓ తాపీ మేస్త్రి, ఓ మెకానిక్ ఆయా వృత్తుల్లో రాణిస్తున్న మేస్త్రిల దగ్గర శిష్యరికం చేసి ఆయా విద్యల నేర్చి పొట్టపోసుకొనేవారు. పొట్టకూటి విద్య పరమావధి అక్కడికే. జీవనోపాధి సంపాదించుకోవటంతో ఆగిపోతే పిల్లికూనకీ, మనకీ తేడా ఏమిటీ? కోతి పిల్లకీ, మన పిల్లలకీ వ్యత్యాసం ఏమిటి?*

*అసలు విద్య పరమార్ధం పొట్టకూడు సంపాదించటమేనా?*

*ఎంతమాత్రంకాదు.*

*వాస్తవానికి – ఏవిద్య అయితే మనిషిని చెడు ఆలోచించకుండా, చెడు చేయకుండా నిరోధిస్తుందో అదే అసలైన విద్య. అదే అసలైన చదువు. ఏవిద్య అయితే మనిషిని అహంకారం నుండి దూరం చేస్తుందో, ఆరిషడ్వర్గాల నుండి దూరం చేస్తుందో అదే అసలైన విద్య. అదే అసలైన చదువు. ఈ నిజాన్ని మన కళ్ళకి కట్టినట్లు చెప్పే ఓ చిన్నకథ చెబుతాను.*

*అవి ధారా నగరాన్ని భోజమహారాజు పరిపాలిస్తున్న రోజులు. స్వయంగా కవీ, పండితుడు అయిన భోజరాజు ఆస్థానంలో చాలామంది కవి పండితులుండేవాళ్ళు. మహాకవి కాళిదాసు వంటి గొప్ప వారుండేవారు.*

*అలాంటి భోజరాజు ఆస్థానంలో ఓ సంస్కృతి పండితుడు ఉండేవాడు. ఇతడు బహు కుటుంబీకుడు. అతడి దురదృష్టమేమో గాని రాజుగారి దృష్టి ఇతడి మీద అంతగా పడలేదు. రాజుని మెప్పించే అవకాశాలు అతడి కంతగా రాకపోవటం చేత, రాజ సన్మానం తక్కువుగా ఉండడం చేత అతడికి ఆర్దికంగా చాలా ఇబ్బందులుండేవి.*

*ఈ దారిద్ర్య బాధ పడలేక ఓరోజు అతడు రాజ ప్రాసాదం నుండి ఏవైనా విలువైన వస్తువులు దొంగిలించాలనుకున్నాడు. ఓరోజు రాత్రి, కొన్ని ద్వారాల దగ్గరి కాపాలా భటుల కనుగప్పి, కొన్ని ద్వారాల దగ్గరి కాపాలా భటులకి రాజుగారే తనని రమ్మన్నారని నమ్మబలికి, రాజు గారి అంతఃపురాన్ని చేరాడు. వెంట ఓపెద్ద సంచీ కూడా తెచ్చుకున్నాడు, దొంగిలించిన సొమ్ము వేసుకుపోవడానికి.*

*మొదట అతడికి ఓ మూల బల్లపై అలంకారార్ధమై పెట్టి ఉంచిన స్వర్ణప్రతిమ కనబడింది. దాన్ని ఎత్తి సంచిలో పెట్టుకోబోయాడు. అంతలో అతడికి తాను చదివిన గ్రంధాల నుండి ‘బంగారు బొమ్మని దొంగిలిస్తే నరకలోకాధిపతి యముడు 7 ఏళ్ళ సుదీర్ఘ కాలం శిక్షవేస్తాడని’ చెప్పే శ్లోకం గుర్తుకువచ్చింది. అంతే! చేతులాడలేదు. బొమ్మని యధాస్థానంలో ఉంచాడు.*

*అంతలో పరిచారకులు రావటంతో మూలన నక్కాడు. మరికొంత సేపు గడిచింది. అంతా సద్దుమణిగాక దారిద్రపీడితడైన ఈ పండితుడు మళ్ళా వెదుకులాట ప్రారంభించాడు. ఈసారి రాజుగారు ధరించే వజ్రాల హారం కనబడింది. నిశ్శబ్ధంగా దాన్ని తీసి సంచిలో వేసుకోబోయాడు. అభరణాలు దొంగిలిస్తే నరకంలో 12 ఏళ్ళు శిక్షపడుతుందన్న శ్లోకం గుర్తుకొచ్చింది. మళ్ళీ ప్రయత్నం విరమించుకున్నాడు.*

*ఉత్తచేతులతో ఇంటికెళ్తే, ఇంట్లో అవసరాలు గుర్తుకొచ్చాయి. మళ్ళీ ప్రయత్నించటం, తప్పుచేస్తే భగవంతుడు దండిస్తాడని చెప్పే శ్లోకం గుర్తుకురావటం, అంతటితో ఆగిపోవటం. రాత్రంతా ఎన్ని వస్తువులపై చెయ్యి వేసాడో, అన్నిటినీ అప్పుడే యధాస్థానంలో పెట్టేస్తూ గడిపేశాడు.*