దొర్లుదొర్లు పుచ్చకాయ్ దొర్లకుంటె దోసకాయ్ (జానపద హాస్యకథ)…

దొర్లుదొర్లు పుచ్చకాయ్ దొర్లకుంటె దోసకాయ్ (జానపద హాస్యకథ).
………
   ఒకూర్లో ఒక పొట్టేలుండేది. అది రోజూ ఊరి బైటకు పోయి మేత మేసి వస్తా వుండేది. ఒక సంవత్సరం ఆ ఊరిలో పెద్ద కరువొచ్చింది. కరువంటే తెల్సుగదా. అస్సలు వానలు పడవు. వానలు పడకపోతే ఏమౌతాది పంటలు పండవు, చెట్లు మొలకెత్తవు. దాంతో మనుషులకే గాదు, పశువులక్కూడా తిండి దొరకడం కష్టమైపోతాది. పాపమా పొట్టేలుకు పొద్దున్నించీ సాయంత్రం వరకూ ఎంత వెదికినా సగం కడుపు కూడా నిండేది గాదు. అట్లా కొన్ని రోజులు పోయేసరికి తిండి సరిగా లేక అది సన్నగా బక్కచిక్కి పోయింది.
ఆ ఊరికి కొంచం దూరంలోనే పెద్ద అడవి వుంది. అడవన్నాక రకరకాల మొక్కలు, చెట్లు వుంటాయి గదా. వాటిని తిని కడుపు నింపుకోవచ్చని పొట్టేలు ఆ అడవికి బైలుదేరింది.
అడవిలో తిండి వెతుక్కుంటా అట్లా పోతావుంటే దారిలో ఒక నక్క ఎదురైంది. నక్కకు పొట్టేలును చూస్తానే నోట్లో నీళ్ళూరినాయి. వెంటనే ఎగిరి పొట్టేలును పట్టుకొని “పొట్టేలు బావా… పొట్టేలు బావా… నిన్ను తినాలనిపిస్తోంది” అనింది.
దానికా పొట్టేలు బాగా ఆలోచించి “నక్క బావా… నక్కబావా… ఇప్పుడు నాలో ఎముకలు తప్ప కండ అస్సల్లేదు. చానా రోజుల్నుండి తిండి లేక సగానికి సగం బక్కచిక్కిపోయినాను. నన్నొదిలేస్తే నల్లకొండకు పోయి నాలుగాకులు, ఎర్రకొండకు పోయి ఏడాకులు, పచ్చకొండకు పోయి పదాకులు మేసి బాగా బలిసి, కొవ్వుపట్టి వస్తా… అప్పుడు తిందువుగానిలే” అనింది. “అట్లాగా…. ఐతే తొందరగా పోయి బాగా బలిసిరాపో” అని నక్క దాన్ని విడిచిపెట్టింది.
పొట్టేలు ‘బతుకు జీవుడా’ అని కొంచం దూరం పోగానే ఒక పులి ఎదురొచ్చింది. అది ఎగిరి పొట్టేలును పట్టుకోని “పొట్టేలు బావా… పొట్టేలు బావా… నిన్ను తినాలనిపిస్తోంది” అనింది.
దానికా పొట్టేలు “పులి బావా… పులి బావా… ఇప్పుడు నాలో ఎముకలు తప్ప కొవ్వు అస్సలేదు. నన్నొదిలేస్తే నల్లకొండకు పోయి నాలుగాకులు, ఎర్రకొండకు పోయి ఏడాకులు, పచ్చకొండకు పోయి పదాకులు
మేసి బాగా బలిసి, కొవ్వుపట్టి వస్తా. అప్పుడు తిందువుగానిలే” అనింది. పులి “అలాగా… ఐతే తొందరగా పోయి బాగా బలిసి రాపో…” అని పులి దాన్ని విడిచిపెట్టింది.
పొట్టేలు హమ్మయ్య అనుకుంటా ఔరబెరా కొంచం దూరం పోయిందో లేదో అంతలోనే ఒక సింహం ఎదురొచ్చింది. అది వెంటనే ఎగిరి పొట్టేలును పట్టుకోని “పొట్టేలు బావా… పొట్టేలు బావా… నిన్ను తినాలనిపిస్తోంది” అనింది.
దానికా పొట్టేలు బాగా ఆలోచించి “సింహం బావా… సింహం బావా… ఇప్పుడు నాలో ఎముకలు తప్ప కొవ్వు అస్సల్లేదు. నన్నొదిలేస్తే నల్లకొండకు పోయి నాలుగాకులు, ఎర్రకొండకు పోయి ఏడాకులు, పచ్చకొండకు పోయి పదాకులు మేసి బాగా బలిసి కొవ్వుపట్టి వస్తా… అప్పుడు తిందువుగానీలే” అనింది. “అట్లాగా… ఐతే తొందరగా పోయి బాగా బలిసి రాపో” అని సింహం దాన్ని విడిచిపెట్టింది.
అట్లా పొట్టేలు నక్క, పులి, సింహాలను తప్పించుకోని నల్లకొండకు పోయి నాలుగాకులు, ఎర్రకొండకు పోయి ఏడాకులు, పచ్చకొండకు పోయి పదాకులు మేసి బాగా బలిసింది. కొన్ని రోజుల తర్వాత వానలు బాగా పడినాయి. దాంతో అది తిరిగి ఇంటికి పోవాలనుకోనింది.
కానీ… దారిలో నక్క, పులి, సింహం ఎదురు చూస్తా వుంటాయి గదా, వాటినెలా తప్పించుకోవాలబ్బా అని ఆలోచించి ఒక పెద్ద పుచ్చకాయలో దూరింది. పుచ్చకాయంటే తెలుసు గదా, కొందరు దాన్ని కలింగడి కాయ అని కూడా అంటారు. పొట్టేలు ఆ పుచ్చకాయలో దూరి
“దొర్లు… దొర్లు… పుచ్చకాయ్ | దొర్లకుంటె దోసకాయ్…” అనుకుంటా గునగునగునమని దొర్లుకుంటా పోసాగింది.
అట్లా దొర్లుకుంటూ పోతావుంటే దారిలో సింహం ఎదురై “ఏందబ్బా ఇట్లా దొర్లుకుంటా పోతా వుంది” అని చూసి “ఏందోలే” అనుకోని కాలితో ఒక తన్ను తన్నింది. దాంతో అదింకా వేగంగా గునగునగునమని దొర్లుకుంటా పోసాగింది.
అట్లా మరి కొంచం దూరం దొర్లుకుంటా పోగానే పులి ఎదురై “ఏందబ్బా ఇట్లా దొర్లుకుంటా పోతావుంది” అని చూసి “ఏందోలే” అనుకోని అది గూడా ఈడ్చి కాల్తో ఒక్క తన్ను తన్నింది. దాంతో అది మరింత వేగంగా గునగునగునమని దొర్లుకుంటా పోసాగింది.
అలా ఇంకొంచెం దూరం పోగానే నక్క ఎదురైంది.  పులిలాగా, సింహంలాగా నక్క తెలివి తక్కువది కాదుగదా. దాంతో అది “ఇదేందబ్బా… పుచ్చకాయేంది… ఇట్లా దొర్లుకుంటా పోవడమేంది. దీని సంగతేమో కనుక్కోవాల”ని దానెంబడే వురకడం మొదలు పెట్టింది.
పుచ్చకాయలో వున్న పొట్టేలు తన వెనకాలే నక్క వురుక్కుంటా రావడం చూసి దానికి దొరగ్గూడదని
“దొర్లు… దొర్లు… పుచ్చకాయ్
దొర్లకుంటె దోసకాయ్…” అనుకుంటా మరింత వేగంగా దొర్లడం మొదలు పెట్టింది. అట్లా కొంచం దూరం పోగానే దారిలో ఒక పెద్దరాయి దానికి అడ్డమొచ్చింది. అది చూసుకోలేదు… వేగంగా పోయి దభీమని దానికి కొట్టుకోనింది. అంతే ఆ దెబ్బకు అది ఫక్కున పగిలి రెండు ముక్కలై పొట్టేలు బైటపడింది.
పొట్టేలును చూసిన నక్క “అమ్మదొంగా… నువ్వా లోపలుంది. నన్నే తప్పించుకోని పారి పోదామనుకుంటా వున్నావా” అని ఎగిరి దాన్ని పట్టుకోనింది. అప్పుడా పొట్టేలు “అదికాదు నక్కబావా… నీకు బాగా బలిసి మళ్ళా వస్తానని చెప్పి పోతావుంటే దారిలో పులి, సింహం కూడా అడ్డం పడినాయి. కానీ ముందు నీకే మాటిచ్చా గదా. అందుకని వాటికి దొరగ్గూడదని దీన్లో దూరి నీ దగ్గరకే వస్తావున్నా.
కానీ ఒక్కమాట… పులి, సింహం నా కోసం వెదుకుతా వెనకాల్నే వస్తా వున్నాయి. అవిగానీ ఈడ మనల్ని చూసినాయనుకో… నన్నే గాదు, నిన్ను కూడా కమ్మగా కూరొండుకోని తింటాయి. నా వెంబడే మా ఇంటికి రా, ఆడైతే ఎవరూ వుండరు. నువ్వొక్క దానివే హాయిగా నన్ను తినొచ్చు. ఏమంటావ్” అనింది. నక్క సరేనని దానెంబడే ఊరికి బైలుదేరింది.
అడవి దాటి కొంచం దూరం పోగానే పొట్టేలు ఇళ్ళొచ్చింది. అది నక్కతో “నువ్వు రొంతసేపు ఈన్నే వుండు. నేను పోయి ఇంట్లో ఎవరన్నా వున్నారేమో చూసొస్తా” అనింది. నక్క సరేననింది.
పొట్టేలు ఇంట్లోకి పోయింది. వాళ్ళింట్లో ఒక పెద్దకుక్క వుంది. పొట్టేలు దాన్ని పిల్చి “కుక్కబావా… కుక్కబావా… నన్ను తినడానికి నక్క ఒకటి వెంటబడింది. నువ్వే ఎట్లాగైనా నన్ను కాపాడాల” అనింది.
కుక్క “అట్లాగా ఆగు దాని సంగతి చెప్తా” అని మొరుగుతా బైటికి వచ్చింది. అంతే… కుక్కను చూడగానే నక్క పై ప్రాణాలు పైన్నే పోయినాయి. దానికి దొరికితే అంతే సంగతనుకోని తిరిగి చూడకుండా అడవి వైపు పారిపోయింది.