*ఒకపూవు కథ (ఆంగ్ల జానపద కథ)* – డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
ఒకూర్లో ఒక రాజున్నాడు. ఆయనకు బంగారు బొమ్మలాంటి ఒక చక్కని కూతురుంది. ఆ పాపంటే ఆయనకు చానా ఇష్టం. చిన్నప్పట్నించీ ప్రేమగా ఏదడిగితే అది కొనిస్తా పెంచి పెద్ద చేసినాడు. పెద్దగైనాక పెండ్లి చేయాల గదా. దాంతో మంచి మంచి సంబంధాలు తేవడం మొదలు పెట్టినాడు. కానీ ఎన్ని సంబంధాలు తెచ్చినా ఆమె నాకు నచ్చలేదంటే నాకు నచ్చలేదంటా ఎగరగొట్టడం మొదలు పెట్టింది. దాంతో ఆయన బాగా విసిగిపోయినాడు.
ఒకరోజు కూతుర్ని పిలిచి “ఏందమ్మా… నేనే సంబంధం తెచ్చినా నచ్చడం లేదంటున్నావ్. అసలు నీకు ఎట్లాంటోడు కావాల్నో చెప్పు… తెచ్చి చేస్తా” అన్నాడు.
అప్పుడామె నెమ్మదిగా “నాన్నా… నాన్నా… నాకు ఈ లోకానికంతా శక్తినిచ్చి వెలుగులు పంచే సూరీడంటే చానా చానా ఇష్టం. నన్ను ఎట్లాగైనా ఆయనకిచ్చి పెండ్లి చేయవా” అనడిగింది.
అప్పుడు వాళ్ళ నాయన “చూడమ్మా… సూర్యునితో పెండ్లంటే మాటలు గాదు. ఆయనెక్కడో ఆకాశంలో తిరుగుతా వుంటాడు. మనముండేదా భూమ్మీద. మనకూ ఆయనకూ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆ సంబంధం కుదిరే పని కాదుగానీ వేరేవాన్ని చేస్కో” అన్నాడు.
కానీ… ఆమె వాళ్ళ నాయన మాట వినిపిచ్చుకోకుండా… “పెండ్లంటూ చేస్కుంటే సూర్యున్నే చేసుకుంటా… లేదంటే లేదు” అని మొండిపట్టు పట్టి కూర్చోనింది.
ఎంత నచ్చచెప్పినా వినకపోయేసరికి వాళ్ళ నాయనకు తెగ కోపమొచ్చేసి “నామాట విననప్పుడు… ఈడెందుకున్నావ్. ఫో… నా దగ్గరనుంచి” అని ఆమెను ఇంట్లోనుంచి దొబ్బేసినాడు..
ఆమె “సూర్యున్ని ఎట్లా పెండ్లి చేసుకోవాలబ్బా” అని ఆలోచిస్తా… ఆలోచిస్తా… పడమటి దిక్కున బయలుదేరి అడవులు, గుట్టలు, వాగులు, వంకలు, ఒకొక్కటే దాటుకుంటా దాటుకుంటా ఒక పెద్ద కొండపైకి ఎక్కింది. ఆ కొండపైన ఒక ఇల్లుంది. ఆ ఇంట్లో ఒక ముసలామె వుంది. ఆమె ఆ రాకుమారిని చూసి “ఏందమ్మా పాపం… ఒక్కదానివే అట్లా తిరుగుతా వున్నావ్. ఏం కావాల నీకు” అనడిగింది. అప్పుడా రాకుమారి కండ్ల నిండా నీళ్ళు కారిపోతా వుంటే జరిగిందంతా చెప్పింది.
అప్పుడా ముసిలామె చీరకొంగుతో ఆమె కండ్లనీళ్ళు తుడుస్తా “నువ్వేమీ బాధ పడొద్దు. నువ్వు వెతికే సూరీడు ఎవరోగాదు నా కొడుకే. ఆకాశంలో పగలంతా తిరిగి తిరిగి అలసిపోయి రాత్రి కాగానే ఇంటికొస్తాడు. నువ్వు నాకెంతగానో నచ్చినావు. నే చెప్తాలే. నా కొడుకుని చేసుకుందువు గానీ” అనింది. దానికామె చానా సంబరపడింది.
సూరీడు ఆకాశంలో పగలంతా తిరిగి తిరిగి అలసిపోయి రాత్రి కాగానే ఇంటికి తిరిగి వచ్చినాడు. ఇంట్లో రాకుమారిని చూసి “ఎవరబ్బా… ఈ అమ్మాయి. మా ఇంట్లో వుంది” అనుకున్నాడు. అంతలో ఆ రాకుమారి సంబరంగా సూర్యుని దగ్గరికి వచ్చి “నువ్వంటే నాకెంతో ఇష్టం. నీకోసం అందర్నీ వదిలి వచ్చేసినా. ఇప్పుడు నువ్వు తప్ప నాకింకెవరూ లేరు. నన్ను పెండ్లి చేసుకోవా” అనడిగింది.
దానికి సూర్యుడు “చూడు పాపా… నేను మీ లెక్క మామూలు మనిషిని కాదు. ఎప్పుడూ భగభగా మండిపోతా సెగలు కక్కుతా వుంటాను. నన్ను కండ్లు తెరిచి సూటిగా చూస్తే సాలు… ఎవరి కండ్లకైనా సరే మబ్బులు కమ్ముతాయి. నన్ను ముట్టుకుంటే చాలు కాలి బూడిదైపోతారు. అట్లాంటిది నువ్వు నన్నెట్లా పెండ్లి చేసుకోగలవ్. పో… పోయి మీ అమ్మా నాన్న చూపిచ్చిన సంబంధం చేసుకోని హాయిగా వుండుపో అన్నాడు.
కానీ ఆమె ఆ మాటలేమీ పట్టిచ్చుకోకుండా “లేదు… నేను నిన్ను తప్ప ఎవ్వరినీ పెండ్లి చేసుకోను. నన్ను చేసుకుంటావా… చేసుకోవా…” అని పట్టుపట్టి కూచోనింది.
ఎంత చెప్పినా వినకపోయేసరికి సూర్యునికి కోపమొచ్చేసి “పెండ్లీ లేదు… గిండ్లీ లేదూ… ఫో… నా ఇంట్లోంచి” అని ఆమెని బైటికి దొబ్బి తలుపేసేసినాడు. పాపం ఆమె ఏడ్చుకుంటా… ఏడ్చుకుంటా ఆకాశంలో తిరిగే సూర్యున్నే చూస్తా చూస్తా ఏమీ తినకుండా కొద్ది రోజులకు చచ్చిపోయింది.
ఆమె ఎక్కడైతే చచ్చిపోయిందో సరిగ్గా అక్కన్నే కొంత కాలానికి మళ్ళా ఒక మొక్కై పుట్టింది. అది కొంతకాలానికి పెరిగి పెద్దగై ఒక పూవు పూసింది. ఆ పూవు ఎట్లుందంటే అరచేయంత పెద్దగా చందమామ లెక్క గుండ్రంగా పసుప్పచ్చని రేకులతో చూడముచ్చటగా వుంది.
ఆరోజు నుండీ ఆ పూవు ఏనాటికైనా సూర్యుడు మళ్ళా రాకపోతాడా… నన్ను పెండ్లి చేసుకోకపోతాడా అని పొద్దున్నే సూర్యుడు ఆకాశంలో కనబడ్డం మొదలు మరలా సాయంత్రం మాయమయ్యేవరకూ సూర్యునికెళ్లే ఆశగా చూస్తా… సూర్యుడు ఎటువైపు తిరిగితే అటువైపు తిరుగుతా వుంది. ఆ పువ్వునే మనం పొద్దుతిరుగుడు పువ్వనీ, సూర్యకాంతమనీ పిలుస్తావుంటే ఆంగ్లభాషలో ‘సన్ ఫ్లవర్’ అంటుంటారు.
*****************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
****************************
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.

Welcome to R9 Telugu News : Get Latest and Breaking News in Telugu, Top News Headlines from Hyderabad and Telangana at our flagship website r9telugunews.com Read Latest Telugu Daily News, Andhrapradesh, Telangana, India, World, Business, Sports, Entertainment News updtes...