నేటి కథ.
మాటంటే మాట*
*
సుబ్బమ్మ, గంగరాజు మొగుడు పెళ్ళాలు.
ఇద్దరికీ అస్సలు పడదు. చీటికీ మాటికీ తిట్టుకునేవారు.
రోజూ గొడవలు, అరుపులు, కేకలే.
చుట్టుపక్కల వాళ్ళకు తల వాచిపోయేది.
దాంతో ఒకరోజు అందరూ వచ్చి “మీరు ఒకరితో ఒకరు మాటలాడితేనే
గదా గొడవలు. ఏదయినా సరే కొంతకాలం నోరు తెరవకుండా కాగితం
మీద రాసి చూపించుకోండి. దాంతో నెమ్మదిగా గొడవలు తగ్గిపోతాయి”
అని సలహా ఇచ్చారు.
వాళ్ళు “సరే” అన్నారు.
తరువాత రోజు పొద్దున్నే ఐదుకంతా గంగరాజు ఊరికి పోవాలి.
దాంతో “రేపు ఉదయం ఐదుకంతా లేపు. పక్క ఊరిలో చాలా అవసరమైన
పని వుంది. తొందరగా వెళ్ళాలి” అంటూ చీటీ మీద రాసి సుబ్బమ్మకు
ఇచ్చి పడుకున్నాడు.
తరువాత రోజు ఉదయం లేచేసరికి ఎప్పటిలాగే పదయింది.
గంగరాజుకు పెళ్ళాం మీద చాలా కోపం వచ్చింది.
“ఏమే పొద్దున్నే లేపమంటే లేపవా. ఎంత పొగరు నీకు” అంటూ
సుబ్బమ్మను తిట్టడానికి విసురుగా పైకి లేచాడు.
అంతలో అతనికి మంచం మీద ఒక చీటీ కనబడింది. తీసి చూశాడు.
అందులో “పొద్దున్నే ఊరుకి పోవాలి. లేపమన్నావు కదా. లే.
ఐదయింది” అని రాసి వుంది.