దొంగ ఏనుగు ‘”మొలక బాలల పత్రిక”లో వచ్చిన చిన్నకథ ..

డా.ఎం.హరికిషన్..

ఒక అడవిలో రెండు గుర్రాలు వుండేవి. అవి రెండూ చాలా బలంగా, ఎత్తుగా, అందంగా వుండేవి. ఆ గుర్రాలు ఉండేది ఒకే చోటనే అయినప్పటికీ ఒకటంటే మరొకదానికి అస్సలు పడేది కాదు. చీటికిమాటికి నీవెంత అంటే నీవెంత అంటూ గొడవలు పడేవి.
ఒకరోజు రెండూ ఆహారం కోసం అడవిలోకి బయలుదేరాయి. అలా పోతావుంటే మొదటి గుర్రానికి కమ్మని మాగిన మామిడిపళ్ళ వాసన వచ్చింది. దాంతో “ఆహా… ఈరోజు విందు భోజనం నా కోసం ఎక్కడో సిద్ధంగా ఉన్నట్టుంది” అనుకుంటూ ఆ వాసన వచ్చిన వైపు పరుగు తీసింది.
అదే సమయానికి రెండవ గుర్రం కూడా మామిడిపళ్ళను చూసింది. “ఆహా… పచ్చగడ్డి తినీ తినీ మొహం మొత్తుతోంది. ఈరోజు ఈ తియ్యని మామిడి పళ్ళు కమ్మగా తినాలి” అని లొట్టలేసుకుంటూ వేగంగా వాటి వైపు పరుగెత్తింది.
అలా ఒక వైపు నుంచి మొదటి గుర్రం, మరొక వైపు నుంచి రెండవ గుర్రం సరిగ్గా ఒకే సమయానికి మామిడిపళ్ళ దగ్గరికి వచ్చాయి.
“మొదట వచ్చింది నేను. అవి నాకే చెందాలి” అనింది మొదటి గుర్రం.
“అబద్దాలాడకు. నీకంటే ముందు వచ్చింది నేను. అవి నాకే చెందాలి” అనింది రెండో గుర్రం.
రెండు గుర్రాలు నాకంటే నాకంటూ ఒకదానినొకటి తిట్టుకోసాగాయి.
ఆ సమయంలో అటువైపు పోతావున్న కుందేలు ఆ గొడవ విని “గుర్రం మామలూ… ఎందుకు అనవసరంగా గొడవ. చెరీసగం పంచుకుంటే సరిపోతుంది కదా” అనింది.
ఆ మాటలకు మొదటి గుర్రం “భూమికి జానెడు ఎత్తు లేవు. నువ్వు మాకు సలహాలు ఇస్తావా. పోతావా లేక వెనుక కాళ్లతో ఎగిరి ఒక్కటి ఇవ్వాల్నా” అంది.
“ఎవరికి కావాలే నీ బోడి సలహాలు. దారిన పోయే ప్రతి వెధవా సలహాలిచ్చే వాడే. మాకు తెలీదా ఏం చేయాలో” అంటూ కసురుకుంది రెండవ గుర్రం.
“ఈ మూర్ఖులతో నాకెందుకు. అనవసరంగా మధ్యలో దూరినందుకు మూతిపళ్ళు రాలినా రాలతాయి” అనుకుంటూ కుందేలు అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది.
మరలా రెండింటికి గొడవ మొదలైంది. మధ్యాహ్నం అయినా తెగలేదు. రెండింటికీ ఆకలి పెరిగిపోతావుంది. నీరసం వస్తా వుంది. అదే సమయానికి ఒక ఏనుగు అటువైపు వచ్చింది. అది వీటి గొడవ చూసి ఆగింది.
“ఏం గుర్రాలూ… ఏంది విషయం. చిన్నపిల్లల మాదిరి అలా గొడవ పడుతున్నారు” అనింది.
చిన్న కుందేలునైతే తిట్టాయి గానీ ఏనుగును ఏమీ అనలేవు కదా. ఏమన్నా అంటే దానికి కోపం వచ్చి తొండమెత్తి బండకేసి కొట్టినా కొడుతుంది. దాంతో జరిగిన విషయమంతా చెప్పి “ఈ పళ్ళు ఎవరికి చెందాలో నువ్వన్నా చెప్పు” అన్నాయి.
ఏనుగు నవ్వి “గుర్రం అంటే గుర్తుకొచ్చేది వేగమే. కాబట్టి మీరిద్దరూ నేను ఒకటి రెండు మూడు అనగానే వేగంగా పరుగెత్తాలి. ఎవరైతే ఇక్కడికి నాలుగు మైళ్ళ అవతల వున్న చెరువులో తామర పువ్వు తెంపుకొని మరలా అంతే వేగంతో ఇక్కడికి వస్తారో వాళ్లు గెలిచినట్టు. వాళ్లకే ఈ తియ్యని పళ్ళు. ఏం సరేనా” అంది.
రెండు గుర్రాలు సరే అంటే సరే అన్నాయి.
ఏనుగు మూడు అంకెలు లెక్కబెట్టగానే రెండూ మెరుపులా దూసుకుపోయాయి. అవి అలా పోవడం ఆలస్యం ఆ ఏనుగు ఇంకోసారి అవి అలా అనవసరంగా గొడవ పడకుండా బుద్ధి వచ్చేలా చేయాలి అనుకుంది. దాంతో ఆ మామిడి పళ్ళు తీసుకొని ఒక్కొక్కటే తినడం మొదలుపెట్టింది. అవి రెండూ తిరిగి వచ్చేసరికి మొత్తం తినేసి ఉత్త టెంకలు మాత్రం అక్కడ పడేసి మాయమైపోయింది.
అలసిపోయి గస బెట్టుకుంటా వేగంగా ఒకేసారి అక్కడికి వచ్చిన గుర్రాలకు వుత్త టెంకలు వెక్కిరించాయి. ఏనుగు మీద కోపం వచ్చింది కానీ భయపడి వూరుకున్నాయి.
“గొడవ పడకుండా కుందేలు చెప్పినట్లు చెరీసగం పంచుకొని ఉంటే బాగుండేది. ఇప్పుడు ఒక్కటి కూడా దక్కలేదు” అని బాధపడుతూ రెండూ నీరసంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి.
*************************