నేటి కథ..బలవంతుని గర్వభంగం….

నేటి కథ..బలవంతుని గర్వభంగం..

ఒకనాడు ఒక బలవంతుడు సోము దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు..

*’ప్రపంచంలో నువ్వు తెలివైన వాడివి, నేను బలమైన వాడిని. నా ఉద్దేశం ప్రకారం మనుషులకు బలం కావాలి తప్ప, తెలివి తేటలతో పనిలేదు. అందువల్ల, నువ్వు, నేను తలపడక తప్పదు. నువ్వు గొప్పో, నేను గొప్పో ఈ రోజున తేలిపోవలసిందే.’*

*సోము బలవంతుడిని ఒకసారి తేరిపార చూశాడు. “నీ బలమెంత?” అని అడిగాడు. “నేను ఒక చేతితో ఒక టన్ను బరువును ఎత్తి సులభంగా ఈ ప్రహరీ గోడ పైనుండి పట్టణం మధ్యకు విసిరివేయగలను” అని బలవంతుడు సమాధానమిచ్చాడు గర్వంగా.*

*”నాకు నమ్మకం కలగటంలేదు” నెమ్మదిగా అన్నాడు సోము*
*”అయితే నా బలాన్ని నీ ముందే నిరూపిస్తాను. ఏ బల పరీక్షకైనా నేను తయారు.” అన్నాడు బలవంతుడు.*
*”సరే, అయితే నీకొక చిన్న బలపరీక్ష పెడతాను. అందులో నెగ్గితే నువ్వు ప్రపంచంలోకెల్లా గొప్పవాడివని అంగీకరిస్తాను” అని సోము బలవంతుడిని ప్రహరీ గోడ దగ్గరకు తీసుకెళ్లాడు.*
*తన జేబులో ఉన్న సిల్కు రుమాలును బలవంతుని చేతిలో పెట్టి, “దీన్ని ఈ ప్రహరీ గోడ అవతలికి విసిరి చూపించు చాలు” అన్నాడు.*

*బలవంతుడు నవ్వుకుంటూ జేబు రుమాలును విసిరేశాడు. అది ప్రహరీ గోడను దాటలేదు. సోము అప్పుడు ఆ రుమాలును తీసుకొని, దానిలో ఒక చిన్న రాయిని కట్టి, దాన్ని ప్రహరీగోడ అవతలికి సులభంగా విసిరేశాడు.*

*బలవంతుడు సిగ్గుతో తలదించుకొని, తన ఓటమిని అంగీకరించాడు. “బలం, తెలివి రెండూ గొప్పవే, ఈ ప్రపంచంలో మనిషికి రెండూ అవసరమే. ఏది లేకున్నా పరాజయం తప్పదు” అని అతన్ని ఊరడించాడు సోము…