కేసీఆర్, అసదుద్దీన్‌లకు బీజేపి వీళ్లవి సుపారి బ్యాచులు అని రేవంత్ రెడ్డి ఎద్దేవా….

ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలోని పెద్దలపై మాట్లాడిన భాష, ప్రస్తావించిన అంశాలను తీవ్రంగా ఎండగట్టడం ద్వారా రేవంత్ రెడ్డి ఒకేసారి బీజేపి, టీఆర్ఎస్ పార్టీలకు షాక్ ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిద్ధాంతాల విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీల దారులు వేరయినప్పటికీ.. కేంద్రాన్ని విమర్శించే క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తరహాలో అతి జుగుప్సాకరమైన భాష ఉపయోగించే కుసంస్కృతి మాత్రం తమకు లేదని రేవంత్ రెడ్డి చెప్పడం గమనార్హం. దేశ ప్రధానిని, దేశ ఆర్థిక శాఖ మంత్రిని అతి జుగుప్సాకరమైన భాషతో దూషించడం ద్వారా తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ నుంచి దేశానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు…టీఆర్ఎస్ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భాషపై విరుచుకుపడటంతో ఊరుకోని రేవంత్ రెడ్డి.. ఓవైపు సీఎం కేసీఆర్ అతి జుగుప్సాకరమైన భాష ఉపయోగించి దేశ ప్రధానిని, ఆర్థిక శాఖ మంత్రిని దూషిస్తుంటే, అదే పార్టీకి చెందిన తెలంగాణ బీజేపి నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదన్నారు. తెలుగింటి ఆడపడుచు అయిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ని సీఎం కేసీఆర్ అంతలేసి మాటలంటుంటే.. తెలంగాణ బీజేపి నేతలు ఏం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అంతేకాకుండా రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగం దేశ ప్రధాని, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిపై నోరుపారేసుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్ధం చేసి నిరసన వ్యక్తంచేయాల్సిందిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపి గెలుస్తుండొచ్చునేమో కానీ సీట్లు మాత్రం తగ్గుతాయని కేసీఆర్ చెప్పడం వెనుకున్న ఆంతర్యం ఏంటో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి గెలుస్తుందని సీఎం కేసీఆర్ చిలక జోస్యం చెబుతున్నారా ? లేక ఏమైనా సర్వేలు చేయించి చెబుతున్నారా ? అదీ లేదంటే బీజేపికి మద్దతుదారుడిగా చెబుతున్నారా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపి గెలుపు కోసం కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసి సుపారి తీసుకుని మరీ పనిచేస్తున్నారని.. వీళ్లవి సుపారి బ్యాచులు అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. .