రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలను అడ్డగోలుగా పెంచుతుంది….ధాన్యం కొనుగోళ్లపై భాజపా, తెరాస కలిసి నాటకాలు ఆడుతున్నాయి…టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి..

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలను అడ్డగోలుగా పెంచిందని.. ధాన్యం కొనుగోళ్లపై భాజపా, తెరాస కలిసి నాటకాలు ఆడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేఖ విధానాలపై ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జూమ్‌ ద్వారా పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చించారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, కార్యదర్శులు, సీనియర్ ఉపాధ్యక్షులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఉద్యమ కార్యాచరణ ఇప్పటికే ఏఐసీసీ ప్రకటించిందన్నారు. మార్చి చివరి నాటికి పంచాయతీ కార్యాలయాలు, ఐకేపీ కేంద్రాల వద్ద ధాన్యం కొనాల్సిందేనని పేర్కొంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేలా స్థానిక నాయకులు చూడాలని స్పష్టం చేశారు. మండలాలు, నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేలా పోరాటాలు చేయాలని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. సీనియర్ నాయకులు జిల్లాల్లో పర్యటించి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలను వివరించాలన్నారు. సమస్య తీవ్రతను బట్టి పోరాటాలను విస్తృతం చేయాలని.. నెల రోజులపాటు వరుస ఉద్యమాలు నిర్వహించి ఏప్రిల్ చివర్లో వరంగల్ రైతు బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టినట్లు రేవంత్ వెల్లడించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఉద్యమాల కార్యాచరణ కోసం ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నేతృత్వంలో సీనియర్లతో కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదించాం. అదేవిధంగా ఏప్రిల్‌ 2 నుంచి 4వ తేదీ వరకు ధరల పెరుగుదలను నిరసిస్తూ మండలాలు, నియోజకవర్గాల్లో ఉద్యమాలు నిర్వహించాలి. 7వ తేదీన పౌరసరఫరాల శాఖ కార్యాలయాలు, విద్యుత్తు సౌధ వద్ద భారీ ధర్నా చేపట్టాలి. ఏఐసీసీ ప్రకటించిన విధంగా పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ మార్చి 31న కాంగ్రెస్ కార్యకర్తలు ఇళ్లలో గ్యాస్ సిలిండర్లకు దండలు వేసి గ్యాస్ సిలిండర్ ధర రూ.1000 అయిందని దండోరా వేయించాలి. డప్పులు కొట్టి నిరసన వ్యక్తం చేయాలి’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు…