ప్రజా సంక్షేమంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది… టీపీసీసి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

రాష్ట్రంలో తెరాస పతనం ప్రారంభమైందని టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శనివారం ఆయన మాట్లాడారు. నిరుద్యోగులకు రూ.3016 ఇస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పైసా ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారన్నారు. తెరాస నుంచి పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరేళ్ల పదవీ కాలంలో ఒక్క ఉద్యోగమైనా ఇప్పించారా అని ప్రశ్నించారు. ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తానని మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పే రివిజన్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో లక్షా 91వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే తెరాస నాయకులు తప్పుడు లెక్కలు చెబుతూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఛైర్మన్‌, సభ్యుల పోస్టులు ఖాళీగా ఉండటం కేసీఆర్‌ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. తెరాస లాండ్‌, సాండ్‌, వైన్‌, మైనింగ్‌ అక్రమాలకు నిలయంగా మారిందన్నారు.అయోధ్యలో రామమందిర నిర్మాణం చేస్తున్న భాజపా ప్రభుత్వం భద్రాద్రి రామాలయానికి చెందిన వేల ఎకరాల భూములను ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు తరలించారో జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. డబ్బు, మద్యంతో ఓట్లు కొనాలని చూస్తున్న తెరాసకు బుద్ధి చెప్పేలా ఓటర్లు కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి రాములునాయక్‌, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.