సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు….దర్శకుడు రాజమౌళి..

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా టికెట్‌ రేట్ల పెంపునకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు చిత్ర దర్శకుడు రాజమౌళి. కర్నాటకలోని చిక్‌ మంగుళూరులో శనివారం సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ…’ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా థియేటర్‌ టికెట్‌ రేట్ల పెంపు విషయంలో సీఎం కేసీఆర్‌ను కలిసి రిక్వెస్ట్‌ చేశాము. ఆయన వెంటనే సానుకూలంగా స్పందించారు. తెలుగు సినిమాకు గర్వకారణమైన ఇలాంటి చిత్రాలకు ప్రభుత్వం తప్పక సహకరిస్తుందని సీఎం చెప్పడం సంతోషాన్ని కలిగించింది. చెప్పడమే కాదు వెంటనే జీవో విడుదల చేశారు. ఈ విషయంలో మాకు ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ సహకరించారు. ఆయనకు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు కృతజ్ఞతలు. ఏపీలో టికెట్‌ రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించిన చిరంజీవికి థాంక్స్‌. కొందరు విమర్శలు చేసినా ఆయన పట్టించుకోకుండా తనవంతు ప్రయత్నాలు చేయడం ఏపీలో టికెట్‌ రేట్ల సవరణ జరిగింది. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చిరంజీవి గారిని ఇండస్ట్రీ పెద్దగా భావిస్తున్నాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోలు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌, కన్నడ చిత్ర పరిశ్రమలోని శివరాజ్‌ కుమార్‌ లాంటి పలువురు ప్రముఖులు, కర్నాటక రాజకీయ నాయకులు పాల్గొన్నారు. నిర్మాత డీవీవీ దానయ్య కూడా టికెట్‌ రేట్ల పెంపునకు అంగీకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఢతలు తెలిపారు.