వాహనదారులకు చలాన్ల చెల్లింపులో రాయితీ గడువు పెంపు….

తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు చలాన్ల చెల్లింపులో రాయితీ గడువు పెంపు…. మరోసారి అవకాశం కల్పించింది. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా పోలీసుల చేత చలాన్ల బారినపడిన వారు..
ఏండ్ల నుంచి ఆ ఫైన్లు కట్టడంలేదు. దాంతో ప్రభుత్వం చలాన్లకు రాయితీ విధానం తీసుకొచ్చింది. దాంతో వాహనదారులు తమ పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకుంటున్నారు. ఆ ఆఫర్ మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుందని పోలీసులు గతంలో తెలిపారు. అయితే సర్వర్ బిజీ రావడంతో కొంతమంది వాహనదారులు తమ చలాన్లను క్లియర్ చేసుకోలేకపోయారు. దాంతో ఈ ఆఫర్‎ను మరో 15 రోజులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 15 వరకు ఈ అవకాశం పొడిగిస్తున్నట్లు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు క్లియర్ అయ్యాయని ఆయన తెలిపారు. ఈ చలాన్ల ద్వారా 250 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు హోంమంత్రి చెప్పారు. ప్రజల నుంచి‌ వస్తున్న స్పందన, విజ్ఞప్తి మేరకు పెండింగ్ చలాన్ల అవకాశాన్ని పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఇంతవరకూ చలాన్లు చెల్లించలేకపోయినవారు ఈ రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ చలాన్ క్లియర్ చేసుకోవాల్సిందిగా వాహనదారులకు సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం బైకులకు 25 శాతం చెల్లిస్తే.. మిగతా 75 శాతం చలాన్‌ అమౌంట్‌ను రాయితీ కింద మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. కార్లు, లైట్ మోటార్ వెహికల్స్‌‌కు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం, తోపుడు బండ్లకి 80 శాతం రాయితీ కల్పించారు. దాంతో వాహనదారుల నుంచి భారీ స్పందన వస్తోంది..