విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం పలాస పాసింజెర్‌ను ఢీ కొట్టిన రాయగడ ఎక్స్‌ప్రెస్.. మూడు బోగీలు బోల్తా.

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాద ఘటనను మరువక ముందే ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఆరుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లా కొత్త వలస మండలం కంటకాపల్లి వద్ద విశాఖ-రాయగడ ప్యాసింజర్‌ రైలును పలాస ప్యాసింజర్‌ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది..
ఓవర్‌ హెడ్‌ కేబుల్‌ తెగిపోవడంతో విశాఖ-రాయగడ ప్యాసింజర్‌ రైలు.. పట్టాలపై నిలిచిపోయింది. ఈ విషయం గమనించకుండా వేగంగా వచ్చిన పలాస ప్యాసింజర్‌ రైలు విశాఖ-రాయగడ ప్యాసింజర్‌ రైలును బలంగా ఢీకొట్టింది. దాంతో విశాఖ-రాయగడ ప్యాసింజర్‌ రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పి బోల్తాపడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే అధికారుల ఆదేశాల మేరకు రెస్క్యూ టీమ్స్‌ ఘటనా ప్రాంతానికి చేరుకున్నాయి. విశాఖ నుంచి ఘటనా స్థలానికి రిలీఫ్‌ రైలును, 14 అంబులెన్స్‌లను పంపించారు.

కానీ, కేబుల్ తెగిపోవడంవల్ల కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ఘటనా ప్రాంతంలో చిమ్మచీకటిగా ఉంది. దాంతో రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర ఆటంకం కలుగుతోంది. కాగా, రైలు ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. సంబంధిత అధికారులను ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు..