నలుగురు తెరాస ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారన్న కేసులో నిందితులకు ఏసీబీ ప్రత్యేక కేసుల న్యాయస్థానం జడ్జి 14 రోజుల రిమాండ్..!!!
నలుగురు తెరాస ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారన్న కేసులో నిందితులకు ఏసీబీ ప్రత్యేక కేసుల న్యాయస్థానం జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని శనివారం రాత్రి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో అంతకుముందు ఉదయం నుంచి భిన్న పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనిపై హైకోర్టులో దాఖలైన వేర్వేరు పిటిషన్లను విచారించిన ఇద్దరు న్యాయమూర్తులు పరస్పర భిన్నమైన ఉత్తర్వులు వెలువరించారు. నిందితుల రిమాండ్‌కు ఏసీబీ కోర్టు తిరస్కరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ.. నిందితులు లొంగిపోవాలని, లేదా వారిని అరెస్టు చేసి, నిబంధనల ప్రకారం రిమాండ్‌కు పంపాలని ఒక న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. ఇంకోవైపు.. ఈ కేసులో రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదంటూ సిట్ లేదా సీబీఐకి అప్పగించాలని భాజపా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన మరో న్యాయమూర్తి.. దర్యాప్తును వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లను పోలీసులు అరెస్టు చేసి ఏసీబీ కోర్టు జడ్జి జి.రాజగోపాల్ ఎదుట హాజరుపరిచారు. ఆయన ఆదేశాల మేరకు నిందితులను జైలుకు పంపారు. విచారణ కోసం వారిని ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల అభ్యర్థనను జడ్జి తిరస్కరించారు. నిందితులను 48 గంటల్లో రెండుసార్లు అరెస్టు చేయడం పోలీసుశాఖలో అరుదైన ఘటనగా చర్చనీయాంశమవుతోంది. రెండోసారి అరెస్టు సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కమిషనరేట్‌లో 15 నిమిషాలు..
అంతకుముందు నందకుమార్ జూబ్లీహిల్స్‌లోని బీవీబీ కూడలిలో ఉన్న డెక్కన్ కిచెన్‌లో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తున్నానంటూ మీడియా ప్రతినిధులకు సంక్షిప్త సందేశాలు పంపాడు. దీంతో పోలీసులు తొలుత నందకుమార్‌ను అరెస్టు చేయాలని హోటల్ డెక్కన్ కిచెన్‌కు చేరుకున్నారు. సమావేశం లేకపోవడంతో నందకుమార్ నివాసానికి వెళ్లి నిందితులను అరెస్టు చేశారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు వెనుక ద్వారం నుంచి తరలించారు. కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఎదుట హాజరుపరిచారు. నిందితుల వివరాలు నమోదు చేసి.. 15 నిమిషాల అనంతరం మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ మరోసారి రిమాండ్ నివేదికలో మార్పులు చేశారు. సాయంత్రం 5.30 గంటలకు వారిని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించి, మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు.
కస్టడీపై 4వ తేదీ తర్వాతే విచారణ..
పోలీసులు శనివారం రాత్రి 9 గంటల సమయంలో నిందితులను సరూర్‌నగర్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి నివాసంలో ప్రవేశపెట్టారు. నిందితులు ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తులని, సింహయాజికి అధిక రక్తపోటు, గుండె నాళాల్లో పూడికలున్నాయని.. రామచంద్రభారతికి లుకేమియా వ్యాధి ఉందని నిందితుల తరఫు న్యాయవాది విన్నవించారు. వీరి అనారోగ్యం దృష్ట్యా జైలులో ఏ క్లాస్ సదుపాయాలు కల్పించాలని అభ్యర్థించారు. ప్రస్తుతానికి రిమాండ్‌కు పంపుతామని.. ఆ విషయంపై సోమవారం వాదనలు వింటామని జడ్జి స్పష్టం చేశారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా, న్యాయస్థానం సమ్మతించలేదు. దర్యాప్తును వాయిదా వేయాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసు కస్టడీకి ఇవ్వలేమంది. 4వ తేదీ తర్వాతే ఆ విషయం గురించి ఆలోచిస్తామని స్పష్టం చేసింది. దీంతో నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. వచ్చే నెల 11 వరకు వారు రిమాండ్‌లో ఉంటారు.
*కీర్తి అనుకుంటే అపకీర్తి పాలయ్యా: నందకుమార్*
నిందితులు ఒకరినొకరు ఎలా కలిశారు? వారికి ఉన్న పాతపరిచయాలు తదితర వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలతో వీరికి ఉన్న అనుబంధంపై ఆరా తీస్తున్నారు. నందకుమార్‌కు పలువురు నాయకులతో పరిచయాలున్నట్టు గుర్తించారు. ఇతడికి సింహయాజితో ఎంతకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయని విచారిస్తున్నారు. ఇటీవల తనను కలిసిన ఓ స్వామీజీ.. కొద్దిరోజుల్లో తాను చాలా కీర్తి సంపాదిస్తానని అన్నట్లు.. కానీ ఇలా అపకీర్తి పాలవుతానని ఊహించలేకపోయానంటూ నందకుమార్ పోలీసుల ముందు వాపోయాడు.
లిప్టు నిలిపివేసిన నందు.. 8 అంతస్తులు ఎక్కిన పోలీసులు..
మొయినాబాద్‌లోని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారన్న ఈ కేసులో నిందితులు ముగ్గురినీ హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు శనివారం ఉదయం రెండోసారి అరెస్టు చేశారు. తొలుత గురువారం వారిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం తగదంటూ ఏసీబీ కోర్టు రిమాండ్‌కు తిరస్కరించిన నేపథ్యంలో పోలీసులు హైకోర్టును ఆశ్రయించి శనివారం అరెస్టుకు అనుమతి పొందారు. నిందితులు ఫిల్మ్‌నగర్-షేక్‌పేట రహదారిలో ఉన్న ఆదిత్య హిల్‌టాప్‌లో ఉన్నట్లు పోలీసులు సమాచారం సేకరించారు. అది నందకుమార్ నివాసం. శనివారం మధ్యాహ్నం సమయంలో బంజారాహిల్స్ పోలీసులు, సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అక్కడికి వెళ్లారు. వారి రాకను గమనించిన నందకుమార్ లిఫ్టును నిలిపివేశాడు. సెల్లార్‌కు చేరుకున్న పోలీసులు ఎనిమిదో అంతస్తు వరకు మెట్లు ఎక్కి వెళ్లాల్సి వచ్చింది. ఫ్లాట్ నంబరు 603లో నందకుమార్‌తోపాటు సింహయాజి, రామచంద్రభారతిలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు..