లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌.. స్పీక‌ర్‌ పోడియం వ‌ద్ద నినాదాలు…

లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌..
స్పీక‌ర్‌ పోడియం వ‌ద్ద నినాదాలు..

పార్ల‌మెంట్‌లో తొలి రోజే ర‌భ‌స మొద‌లైంది. లోక్‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల‌ను ర‌ద్దు చేసి రైతు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేశాయి. స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత స్పీక‌ర్ ఓం బిర్లా కొత్త స‌భ్యుల చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు.
ఆ త‌ర్వాత ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యం మొద‌లైంది. కానీ ఆ స‌మ‌యంలో టీఆర్ఎస్ నేత‌లు స‌భ‌లో నిర‌స‌న చేప‌ట్టారు. లోక్‌స‌భ‌లో పోడియం ద‌గ్గ‌ర‌కు వెళ్లి టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం త‌మ విధానాన్ని ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ మార్కెట్ యార్డుల్లో మ‌క్కిపోతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని ఎంపీలు డిమాండ్ చేశారు. ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు నేతృత్వంలో టీఆర్ఎస్ స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్టారు. దీంతో స్పీక‌ర్ బిర్లా స‌భ‌ను మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు…

అంతకుముందు..ధాన్యం కొనుగోలుపై చ‌ర్చించండి.. ఉభ‌య‌స‌భ‌ల్లో టీఆర్ఎస్ వాయిదా తీర్మానం..

R9TELUGUNEWS.COM.
కేంద్ర స‌ర్కార్ తీరుపై తెలంగాణ రాష్ట్ర స‌మితి యుద్ధానికి సిద్ధ‌మైంది. ఇవాళ పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో.. ధాన్యం కోనుగోలు అంశంపై కేంద్రంతో తేల్చుకోనున్న‌ది.

ధాన్యం కొనుగోలు అంశంపై చ‌ర్చించాల‌ని ఉభ‌య‌స‌భ‌ల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. తెలంగాణ‌లో చాలా దారుణ‌మైన ప‌రిస్థితి నెల‌కొని ఉన్న‌ద‌ని, రూల్ 267 కింద త‌క్ష‌ణ‌మే ధాన్యం కొనుగోలు అంశంపై చ‌ర్చించాల‌ని రాజ్య‌స‌భ చైర్మ‌న్‌ను ఎంపీ కేశ‌వ‌రావు డిమాండ్ చేశారు. ఎఫ్‌సీఐ నిర్ల‌క్ష్య‌పూరిత వైఖ‌రి వ‌ల్ల తెలంగాణ‌లో ల‌క్ష‌ల ట‌న్నుల ధాన్యం మార్కెట్ యార్డుల్లో మురిగిపోతోంద‌ని ఎంపీ కేశ‌వ‌రావు త‌న లేఖ‌లో పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం పంట సేక‌ర‌ణ విధానం వివ‌క్ష‌పూరితంగా ఉంద‌ని, తెలంగాణ‌లో పండిన ర‌బీ పంట‌ను కేంద్రం సేక‌రించ‌డంలేద‌ని ఆయ‌న ఆరోపించారు.