తెలంగాణ దేశానికే ఆదర్శం : గవర్నర్ తమిళిసై.

తెలంగాణ దేశానికే ఆదర్శం : గవర్నర్ తమిళిసై

తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. నాంప‌ల్లి ప‌బ్లిక్ గార్డెన్‌లో 72వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ జాతీయ జెండాను ఆవిష్క‌రించి, పోలీసు గౌర‌వ వంద‌నాన్ని స్వీక‌రించారు. తెలుగు ప్రజలకు గవర్నర్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళుతుందని ఆమె తెలిపారు. భార‌త్ బ‌యోటెక్ తొలి దేశీయ టీకాను రూపొందించడం తెలంగాణకు గర్వకారణమని ఆమె చెప్పారు. కరోనాను ఎదుర్కోవడంలో పోరాడిన ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌కు గవర్నర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప‌ల్లె ప్ర‌గ‌తి ద్వారా గ్రామాల్లో మౌలిక స‌దుపాయాలు క‌ల్పించామ‌ని ఆమె చెప్పారు. ప‌ల్లె ప్ర‌గ‌తి ప‌థ‌కం దేశానికి ఆద‌ర్శంగా నిలిచింద‌ని ఆమె కొనియాడారు. హ‌రిత‌హారంలో నాటిన మొక్క‌ల్లో 91 శాతం సంర‌క్షించామ‌ని ఆమె వెల్లడించారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించినట్టు ఆమె చెప్పారు. రాష్ట్రంలో సాగు, తాగు నీటి ప్రాజెక్టులు శరవేగంతో పూర్తవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్ని విదాల అండగా ఉంటూ రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు అందించడంతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్ ను అందిస్తుందని ఆమె చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన రెవెన్యూ సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిఎం కెసిఆర్, అసెంబ్లీ స్పీకర్ పోచారం, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎంఎల్ఎలు, ఎంఎల్ సిలు, ఎంపిలు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.