విభజన చట్టానికి సవరణలు అవసరం లేదు

రాష్ట్ర విభజన జరిగిన ఏడున్నరేండ్ల తరువాత ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014కు సవరణలు చేయాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టంచేసింది. విభజన సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ గురువారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. కేంద్ర, రాష్ట్ర సంబంధాల విభాగం జాయింట్‌ సెక్రటరీ ఆశిశ్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్‌, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, ట్రాన్స్‌కో జేఎండీ సీ శ్రీనివాస్‌రావు, ఐఏఎస్‌ అధికారులు నీతూప్రసాద్‌, అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు..ఏపీ నుంచి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌తో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలో వసూలయ్యే పన్నుల్లో వాటా కావాలని ఆంధ్రప్రదేశ్‌ చేసిన వాదనను తెలంగాణ గట్టిగా వ్యతిరేకించింది. తెలంగాణతో ఏకీభవించిన కేంద్ర హోంశాఖ ఈ అంశం విభజన సమస్యల కిందకు రాదని స్పష్టంచేసింది. ఎజెండా నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. సమావేశంలో విద్యుత్తు బకాయిలు, ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ విభజన, పన్నుల కోసం విభజన చట్టానికి సవరణ, నగదు నిల్వల పం పిణీ, పౌరసరఫరాల సంస్థకు రావాల్సిన సబ్సిడీల అం శాలను చర్చించారు. విద్యుత్తు, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ఇతర ఆర్థిక వ్యవహారాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోర్టుల్లో కేసులు వేయడాన్ని తెలంగాణ అధికారులు ఎండగట్టారు. మందుగా కోర్టుల్లో వేసిన కేసులు విత్‌డ్రా చేసుకుంటే, సమస్యలన్నింటిని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని తెలంగాణ అధికారులు ఆంధ్రప్రదేశ్‌కు తేల్చి చెప్పారు. దీనిపై ఏపీ అధికారులు మిన్నకుండి పోయారు. కేంద్రం కూడా స్పందించలేదు…