తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టు కీలక ఆదేశాలు..కొవిడ్‌ పరీక్షలను పెంచాలని ఆదేశాలు జారీ..!!.

కొవిడ్‌ తీవ్రత పెరుగుతున్నందున పరీక్షలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం సమర్పించిన వివరాల ప్రకారం ఇటీవల కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, అందువల్ల పరీక్షల సంఖ్యను పెంచి నాలుగో విడత వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంది. కొవిడ్‌పై దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా నమోదవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేంద్రప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలని ఆదేశించింది. అంతేగాకుండా కొవిడ్‌ కారణంగా మృతి చెందినవారి కుటుంబసభ్యులకు పరిహారం చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ధర్మాసనం పేర్కొంది. వీటిపై సవివర నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది…