తెలంగాణ లో ఎన్నికల కసరత్తు ముమ్మరం..

తెలంగాణ లో ఎన్నికల కసరత్తు ముమ్మరం.

రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్ర సీఈఓ కార్యాలయం కసరత్తు ముమ్మరం చేసింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామక ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. అదనపు కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి, జోనల్ కమిషనర్ తదితర ర్యాంకుల్లోని అధికారులను రిటర్నింగ్ ఆఫీసర్లుగా నియమించింది. వారి కింద సహాయకులుగా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను కూడా నియమించింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2018లో సెప్టెంబరు 28న రాష్ట్ర ప్రభుత్వం ఈ నియామకాలకు గెజిట్ నోటిఫికేషన్ జారీచేయగా ఈసారి జూలై సెకండ్ వీక్‌లోనే కంప్లీట్ చేసింది.

*విద్యాసంస్థలకు లేఖలు..

ఎలక్షన్ స్టాఫ్‌ను సమకూర్చుకోవడానికి అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ లేఖలు రాశారు. దీంతో కలెక్టర్లు ఆ జిల్లా పరిధిలోని అన్ని విద్యా సంస్థలకు లేఖలు రాశారు. బోధనా, బోధనేతర సిబ్బందిని ఎన్నికల విధులకు పంపాలంటూ ఉత్తర్వులు ఇచ్చారు. అన్ని జిల్లాల, మండలాల విద్యాధికారులకూ నిర్దిష్ట ప్రొఫార్మాలో వివరాలను పంపించడానికి జూలై 18ని డెడ్‌లైన్ విధించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లపై సీఈఓ నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాను వచ్చే నెల 2న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

*40 అంశాలతో ప్రొఫార్మా*

ఎన్నికల విధుల్లో పాల్గొనే టీచర్లు, నాన్-టీచింగ్ స్టాఫ్ సొంత జిల్లా, అసెంబ్లీ సెగ్మెంట్, పని చేస్తున్న ప్రాంతం, నివాసం, వ్యక్తిగత వివరాలు అన్నింటినీ అందజేయాలని కలెక్టర్లు ఆ లేఖలో పేర్కొన్నారు. మొత్తం 40 అంశాల్లో వివరాలు పంపాలని సూచించారు. గతంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న అనుభవంతో పాటు వారిపై ఏమైనా ఫిర్యాదులు, చర్యలు ఉంటే వాటిని కూడా వివరించాలని పేర్కొన్నారు. శాఖాపరమైన చర్యలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే వాటిని ప్రస్తావించాల్సిందిగా నొక్కిచెప్పారు.

ఇదిలా ఉండగా ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో కొత్త ఈవీఎంలు, వీవీప్యాట్‌లను ఎన్నికల సంఘం వినియోగిస్తున్నది. ఈసీఐఎల్ నుంచి వీటిని సమకూర్చుకుని అన్ని జిల్లా కేంద్రాలకు తరలించింది. వీటి ఎంట్రీ లెవెల్ చెకింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఎలక్షన్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన ట్రెయినింగ్ ఇవ్వడానికి మాస్టర్ ట్రెయినర్లకు శిక్షణ కూడా ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు రాష్ట్రానికి వచ్చి నాలుగు రోజుల పాటు సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లపై వివిధ విభాగాలకు రోడ్ మ్యాప్ ఇచ్చింది. నగదు, మద్యం, గిఫ్టుల రవాణాను అరికట్టడానికి చెక్‌పోస్టుల ఏర్పాటు మొదలు రాష్ట్ర, కేంద్ర పారా మిలిటరీ బలగాల మోహరింపు వరకు స్పష్టమైన దిశానిర్దేశం చేసింది.