బీజేపీ, బీఆర్ఎస్ లగ్గం పిలుపు – టీ కాంగ్రెస్ మరో వినూత్న ప్రచారం..!!

తెలంగాణ ఎన్నిక ప్రచారంలో కొత్త పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎలాగైనా అధికారంలోకి రావటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ఓటర్లను ఆకర్షించేందుకు వినత్న ప్రచారంతో ముందుకు వెళ్తోంది. బీఆర్ఎస్, కేసీఆర్ లక్ష్యంగా డిజిటల్ క్యాంపెయిన్ చేస్తున్న కాంగ్రెస్ మరో కొత్త తరహా ప్రచారం ప్రారంభించింది. బీఆర్ఎస్, బీజేపీ బీ టీంగా ఉందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఆ రెండు పార్టీల మధ్య బంధాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పెళ్లి కార్దు ప్రచారం మొదలు పెట్టింది.తెలంగాణలో ఎన్నికల వార్ బీఆర్ఎస్ వర్సస్ కాంగ్రెస్ గా మారింది. తమకు పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని..అధికారం ఖాయమని కాంగ్రెస్ ధీమాతో ఉంది. ఈ సమయంలోనే బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తోంది.
అందులో భాగంగా వినూత్న మార్గాలను ఎంచుకుంది. తెలంగాణలో బీఆర్ఎస్, ఎంఐఎం రెండు పార్టీలు బీజేపీకి బీ టీంలుగా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే ప్రధాని హైదరాబాద్ వచ్చే సమయంలో కేసీఆర్, అసద్ ను ప్రధాని మోదీ తోలుబొమ్మల్లా ఆడిస్తున్నట్లుగా ముఖ్యమైన ప్రదేశాల్లో తోలుబొమ్మలు ప్రదర్శించారు.

ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ లగ్గం పేరుతో ఒక శుభలేక తరహాలో కార్డు తయారు చేసి ఓటర్ల మధ్యకు తీసుకెళ్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ల ఒప్పందానికి సంబంధించి పెళ్లి పత్రిక,వీడియో ను విడుదల చేసిన కాంగ్రెస్. పూర్తిగా తెలంగాణ యాసలోనే కార్డులో అన్ని అంశాలను వెల్లడించింది. ఈ కార్డులో నాకు నువ్వు బీఆర్ఎస్, నీకు నేను బీజేపీ అంటూ..లోపాయి కారి ఒప్పందం మాది అంటూ రాసుకొచ్చారు. 2023 ఎన్నికల్లో లగ్గం ముహూర్తంగా నిర్ణయించారు. నక్షత్రం పేరుగా కవిత పై కరుణ నక్షత్రంలో ముహూర్తంగా వివరించారు. అమర వీరుల ఆత్మ ఘోషతో ఈ లగ్గం జరుగుతున్నట్లుగా పేర్కొన్నారు.