తెలంగాణలో గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్….

తెలంగాణలో గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల దృష్ట్యా గురుకులాలు ప్రారంభించాలని.. గురుకులాల పునఃప్రారంభంపై స్టే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరిన విషయం తెలిసిందే. గురుకులాలు తెరవొద్దని గతంలో ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ మిగతా పాఠశాలలు నడుస్తున్నాయని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పరిస్థితుల దృష్ట్యా పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని ప్రభుత్వ న్యాయవాది సోమవారం కోర్టును కోరారు.ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సీజే ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. విద్యా సంస్థల్లో కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ప్రసాద్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గురుకులాల్లో ప్రత్యక్ష, ఆన్‌లైన్‌ బోధన చేపట్టాలని ధర్మాసనం ఆదేశించింది. గురుకులాలు తెరవొద్దన్న గత ఆదేశాలను సవరిస్తూ తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇస్తూ తీర్పు వెల్లడించింది…