తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఫ్యాక్టరీ..

కాలిఫోర్నియాకు చెందిన బిలిటీ ఎలక్ట్రిక్ కంపెనీ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఫ్యాక్టరీని తెలంగాణలో స్థాపించేందుకు సిద్ధమైంది...

తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఫ్యాక్టరీ

కాలిఫోర్నియాకు చెందిన బిలిటీ ఎలక్ట్రిక్ కంపెనీ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఫ్యాక్టరీని తెలంగాణలో స్థాపించేందుకు సిద్ధమైంది.
ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధి రాహుల్ గయాం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతి ఏడాది 2,40,000 ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ఈ కంపెనీని ప్రారంభించబోతున్నట్లు రాహుల్ తెలిపారు. అమెరికాకు చెందిన విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) తయారీ సంస్థ ఫిస్కర్‌.. హైదరాబాద్‌లో తమ రెండో ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ కంపెనీ సరసన బిలిటీ ఎలక్ట్రిక్ కంపెనీ నిలవనుంది.

ఈ కొత్త ప్లాంట్‌లో 150 మిలియన్ డాలర్లతో పెట్టుబడులు పెట్టబోతున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 3 వేలకు పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ప్రస్తుతం బిలిటీ కంపెనీ హైదరాబాద్‌కు చెందిన గయాం మోటార్ వర్క్స్‌తో కలిసి త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయనుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రెండేండ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీని ప్రారంభించిందని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి తెలంగాణను గమ్యస్థానంగా మార్చాలనే ఉద్దేశంతో ఈ పాలసీని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఆ కల సాకారం కాబోతుందన్నారు. బిలిటీ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ – వీలర్ ఫ్యాక్టరీని ప్రారంభించబోతుందన్నారు. ఈ ఏడాది బిలిటీ కంపెనీదే అతిపెద్ద పెట్టుబడి అని కేటీఆర్ పేర్కొన్నారు.