తెలంగాణ లా సెట్ ఫలితాలు విడుదల.
తెలంగాణ లాసెట్, పీజీ లా సెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో.. చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ ఆర్ లింబాద్రి లాసెట్, పీజీలాసెట్ ఫలితాలు ప్రకటించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు https://lawcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపారు. మూడేళ్ల లా సెట్‌లో 74.76 శాతం, ఐదేళ్ల లా సెట్‌లో 68.57 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
పీజీ లా సెట్‌లో 91.10 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది జూలై 21, 22 తేదీల్లో జరిగిన లాసెట్, పీజీలాసెట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 35,538 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. ఇందులో 28,921 మంది ప్రవేశ పరీక్షలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకటరమణ, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ యాదవ్, లా సెట్ కన్వీనర్.. జీబీరెడ్డి, ఉన్నత విద్యా మండలి సెక్రెటరీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.