తెలంగాణకు హెచ్చరిక..మరో రెండ్రోజులు ఎల్లో అలర్ట్..!

భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో అతలాకుతలం అవుతున్న తెలంగాణకు ఈ బాధలు మరో మూడు రోజుల వరకు తప్పేలా లేవు. రాష్ట్రంలో ఆగస్టు 1వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. భారీ వర్షాల తీవ్రత అయితే తగ్గిందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో 28, 29వ తేదీ వరకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని.. ఆగస్టు 1 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైందని.. ఆంధ్రప్రదేశ్‌లోని ఆ ప్రభావంతోనే తెలంగాణలో వర్షాలు పడుతున్నాయని పేర్కొంది. ఆదిలాబాద్, కొమరం భీం, నిర్మల్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, నారాయణపేట్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు…