మహిళలను బస్సులో నుండి దించిన కండక్టర్..!

రాత్రి వేళ బస్సెక్కిన ఓ పది మంది మహిళలను ఆర్టీసీ కండక్టర్‌ ఓవర్‌ లోడ్‌ పేరిట నిర్ధాక్షిణ్యంగా దారి మధ్య లో వదిలి వెళ్లాడు. ఈ ఘటన గురువారం రాత్రి జగిత్యాలలో చోటుచేసు కున్నది.

జగిత్యాల నుంచి ధర్మారం వెళ్లే ఆర్టీసీ బస్సు రాత్రి 8 గంటలకు జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ నుంచి బయలుదేరింది. బస్సు ఓవర్‌ లోడ్‌ అయిందని, టికెట్లు ఇచ్చే మెషీన్‌లో చార్జింగ్‌ లేదని, మెషీన్‌ నుంచి టికెట్లు రావడం లేదన్న సాకుతూ రూరల్‌ మండలంలోని తిమ్మాపూర్‌ శివారులో గల నల్లగుట్ట వద్ద పదిమంది మహిళలను కండక్టర్‌ దింపేశాడు.

దీంతో మహిళా ప్రయాణి కులు ముందుకు, వెనక్కి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో తిమ్మాపూర్‌ క్రాస్‌ రోడ్డులోని గ్రామస్థులు ధర్మారం వైపు వెళ్తున్న చివరి బస్సును ఆపి వారిని ఎక్కించారు.

ఆ బస్సులోనూ ఓవర్‌లోడ్‌ ఉన్నదని కండకర్టర్‌ చెప్పగా, గ్రామస్థులు బతిమిలాడి బస్సు ఎక్కించి మహిళలను గమ్య స్థానాలకు దించాలని వేడుకున్నారు. ఈ విషయ మై డీఎం సునీతను సంప్ర దించగా స్పందించలేదని తెలిసింది…