TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీపై బిజెపి పోరాటం ఉధృతం..నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు..
తెలంగాణ బీజేపీ మరో పోరుకు సిద్ధమవుతుంది. TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీపై పోరాటం ఉధృతం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఇందులో భాగంగానే నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ కీలక ఘట్టంగా నిలిచిన నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ నేతలు మరోమారు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అదే స్థాయిలో నిరుద్యోగులతో కలిసి జూన్‌లో వారికి మద్దతుగా భారీ ఆందోళనకు కసరత్తు చేస్తున్నారు. నిరసనలు, ర్యాలీలతో యువత, బాధిత కుటుంబాలకు మరింత చేరువు కావాలని కమలం నేతలు ప్లాన్ చేస్తున్నారు. TSPSC పేపర్ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారంటూ బీజేపీ ఇప్పటికే ఆందోళనలు చేపట్టింది. మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు గుప్పించారు. కేటీఆర్ బర్తరఫ్ చేయాలని, హైకోర్టు సిటింగ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ నేపథ్యంలో నిరుద్యోగులకు లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగానే రేపు వరంగల్‌లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించనుంది. ఆ తర్వాత రెండో నిరుద్యోగ మార్చ్‌ను మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్నారు. అనంతరం ప్రతి ఐదారు రోజులకు ఒక ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఈ మార్చ్‌లు నిర్వహిస్తామని ఇప్పటికే బీజేపీ నేతలు ప్రకటించారు. పది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మే నెలాఖరు వరకు ఈ కార్యక్రమాలు ముగించనున్నారు. తర్వాత హైదరాబాదులో భారీస్థాయిలో మిలియన్ మార్చ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక వరంగల్‌లో నిరుద్యోగ మార్చ్ కోసం బీజేపీ నిరుద్యోగ బాధితుడు-30 పేరిట కంకణాలు సిద్ధం చేసింది బీజేపీ. వీటిని నిరుద్యోగ మార్చ్‌లో పాల్గొనేవారికి అందించనుంది. TSPSC పేపర్ల లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగులు నష్టపోయారన్న సంకేతంతో వీటిని రూపొందించినట్లు తెలుస్తోంది. నిరుద్యోగుల ఇబ్బందులు, బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ విస్తృత ప్రచారం చేయనున్నారు.