TSPSC గ్రూప్ – I ప్రిలిమ్స్ రద్దు చేసిన హై కోర్టు
తెలంగాణలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది.
హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రద్దు చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. మొత్తం 503 గ్రూప్1 పోస్టుల భర్తీ కోసం జూన్ 11న టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షలకు 2.32లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు.అయితే, ఈ పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని, హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్‌లు వేశారు. గ్రూపు పరీక్షలు మొత్తం రద్దు చేయాలని కాంగ్రెస్ NSUI నేత బాల్మూరి వెంకట్ పిటిషన్ లో పేర్కొన్నారు. పిటీషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు శనివారం తీర్పును వెల్లడించింది. జూన్ 11న నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది.