గ్రూప్‌-4 పరీక్షకు అధికారులు విస్తృత ఏర్పాట్లు .

*టీఎస్‌పీఎస్సీ ద్వారా శనివారం నిర్వహించనున్న గ్రూప్‌-4 పరీక్షకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు*.

పరీక్ష నిర్వహణపై టీఎస్పీఎస్సీ అధికారులు ఇదివరకే అన్ని జిల్లాల కలెక్టర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

పరీక్ష ఏర్పాట్లు, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలపై చర్చించారు. జూలై 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుంది. మొత్తం 8,180 పోస్టులకు గాను 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

*2,846 కేంద్రాల్లో పరీక్ష*

పరీక్ష నిర్వహణకు రాష్ర్టంలోని 33 జిల్లాల్లో 2,846 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచగా ఇప్పటికే అభ్యర్థులందరూ డౌన్‌లోడ్ చేసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద రెండంచెల పద్ధతిలో అభ్యర్థులను తనిఖీ చేయనున్నారు. పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి కనీసం 15 నిమిషాలు ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

సమయం దాటితే లోనికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. బస్టాండ్లలో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. లైజనింగ్‌ ఆఫీసర్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమించారు. అభ్యర్థులు నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు.

*గుర్తింపుకార్డు తప్పనిసరి*

ప్రభుత్వం జారీచేసిన ఏదైనా ఒక ఫొటో గుర్తింపు కార్డును అభ్యర్థులు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. హాజరుపట్టికలో ఫొటో, అభ్యర్థి గుర్తింపు కార్డు, ముఖాన్ని సరిచూసి సంతకం, వేలిముద్ర తీసుకుంటారు. పరీక్షకు అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరు కానున్న నేపథ్యంలో కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను టీఎస్పీఎస్సీ కమిషన్‌ ఆదేశించింది.

గతంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకొని ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. టీఎస్పీఎస్సీ నిర్వహించే తదుపరి పరీక్షల్లో అభ్యర్థులు తమ ఓఎంఆర్‌ పత్రాల్లో హాల్‌టికెట్‌ నంబరు, ప్రశ్నపత్రం కోడ్‌, పేరు, సంతకం తప్పకుండా పేర్కొనాల్సి ఉంటుంది.

*ప్రచారం అవాస్తవం*

గ్రూప్‌-4 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తాళిబొట్టు, మెట్టెలు తీసేయాలనే ఎలాంటి నిబంధనలు లేవని శుక్రవారం ఆయన వెల్లడించారు. హిందూ సంప్రదాయాలను కించపరుస్తున్నారని పలువురు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. ఇలాంటి అసత్య ప్రచారాలతో అభ్యర్థులు గందరగోళ పరిస్థతులు ఎదుర్కొనే అవకాశముందని పేర్కొన్నారు.

అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని సూచించారు. కొన్నిచోట్ల తాలూకా, మండల స్థాయిలోనూ పరీక్ష కేంద్రాలు ఉండడంతో బందోబస్తుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష ఏర్పాట్లపై ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశాలు నిర్వహించామని వివరించారు. సుమారు 40 వేల మంది ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు.