తెలంగాణ ఆర్టీసీలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణపై ఆసక్తి చూపే వారి వివరాల సేకరణ…

తెలంగాణ ఆర్టీసీలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణపై ఆసక్తి చూపే వారి వివరాలను సేకరిస్తున్నారు. ఎందరు ముందుకు వస్తారన్న దాని ఆధారంగా ఈ పథకాన్ని అమలు చేయాలా? వద్దా? చేస్తే ఏ ప్రాతిపదికన అమలుచేయాలి? ఎంత సొమ్ము చెల్లించాలి? తదితర అంశాలపై చర్చించేందుకు అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి డిపోలో ఒక రిజిస్టరు ఏర్పాటుచేసి ఆసక్తి చూపే వారి వివరాలను నమోదు చేయిస్తున్నారు. అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయకుండా క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇటీవల సంస్థకు నష్టాలు పెరుగుతుండటంతో బస్సుల సంఖ్యను భారీగా తగ్గించారు. దీంతో సిబ్బంది విధుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో నెలకొంది. ప్రస్తుతం 6,075 సొంత బస్సులు మాత్రమే నడుస్తుండగా.. ప్రయివేటు బస్సులు 3,100లకు పెరిగాయి. ఉద్యోగుల్లో పెద్దగా ఆసక్తి లేకపోయినప్పటికీ పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. వివిధ స్థాయుల్లో ప్రస్తుతం 47,528 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గతంలో ఉద్యోగ విరమణ చేసిన వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఇప్పటికీ పూర్తి స్థాయిలో చెల్లించలేని పరిస్థితి. ఉద్యోగుల డీఏ సైతం పెండింగులో ఉంది.

*లోపాలతోనే ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం*

ఆర్టీసీ ఆస్తులతో పోలిస్తే అప్పులు 10 శాతానికి మించవు. ఆస్తులు రూ.50 వేల కోట్లు ఉంటాయని అంచనా. అప్పులు రూ.5 వేల కోట్లు. గడిచిన కొన్నేళ్లుగా చోటుచేసుకున్న లోపాలతోనే ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని ఉద్యోగవర్గాల వేదన. కరోనా సమయంలో మినహా మిగిలిన సమయంలో రాయితీ మొత్తాలను పూర్తిస్థాయిలో ఇచ్చిన దాఖలాలు లేవు. పరిపాలనా విభాగాల్లో మినహా మిగిలిన విభాగాల్లో ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పదవీ విరమణ వరకు ఒకే పోస్టులో పనిచేసేవారు ఎక్కువే. అవకాశం వస్తే ఎక్కువ మంది కండక్టర్లు, డ్రైవర్లు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు ఆసక్తి చూపుతారు. ఈ పరిస్థితులన్నింటి దృష్ట్యా వీఆర్‌ఎస్‌ పథకం అమలు చేస్తారా అన్నది చర్చనీయాంశమైంది.