మూడేళ్ల తర్వాత తెలంగాణ ఆర్టీసీలోని (TSRTC) సంఘాలన్నీ కలిసి జేఏసీ ఏర్పాటు..ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వత్థామరెడ్డి..
మూడేళ్ల తర్వాత తెలంగాణ ఆర్టీసీలోని (TSRTC) సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడినట్లు ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదని ఆరోపించారు.హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ కన్వీనర్ హనుమంతు ముదిరాజ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగులకు రెండు పర్యాయాలు వేతన సవరణ జరగలేదని అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయబోనని చెప్పిన కేసీఆర్ మాటలను.. సంస్థ యాజమాన్యం ఏమాత్రం విశ్వసించడం లేదని చెప్పారు. ఆర్టీసీ డిపోలు మూతపడుతూ.. ప్రైవేటు బస్సులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డిపోల మూసివేతను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులు పెంచాలని కోరారు. అన్నారు. కార్మికుల సమస్యలను ఆర్టీసీ ఛైర్మన్, ఎండీ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో వేతన సవరణ జరిగినా.. ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రం జరగలేదు. ఆర్టీసీ కార్మికులపై భారం తగ్గకపోగా.. మహిళా కార్మికులపై పని భారం పెరిగింది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై అన్ని డిపోల్లో పర్యటించి.. వారందర్నీ ఏకం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం” అని అశ్వత్థామరెడ్డి తెలిపారు. రాజకీయలకు అతీతంగా ఏర్పడిన జేఏసీలో ఇతర కార్మిక సంఘాలు కూడా చేరాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ హనుమంతు ముదిరాజ్ కోరారు. అన్ని డిపోల్లోని కార్మికులను చైతన్యపరిచి భవిష్యత్ కార్యాచరణ చేపడతామని ఆయన అన్నారు.