తిరుపతి- తిరుమల మధ్య విద్యుత్తు బస్సులు..ఏపీఎస్‌ఆర్టీసీ నుంచి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు 100 బస్సుల కాంట్రాక్టు…

తిరుపతి- తిరుమల మధ్య విద్యుత్తు బస్సులు..ఏపీఎస్‌ఆర్టీసీ నుంచి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు 100 బస్సుల కాంట్రాక్టు.

R9TELUGUNEWS.COM హైదరాబాద్‌కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌, ఈవీ ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కన్సార్షియమ్‌కు ఏపీఎస్‌ఆర్‌టీసీ (ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) 100 విద్యుత్తు బస్సుల కాంట్రాక్టు ఇచ్చింది. ఈ బస్సులను గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌, అపెక్స్‌ మోడల్‌ ప్రాతిపదికన అందించి, నిర్వహించాల్సి ఉంటుంది. కాంట్రాక్టు కాలపరిమితి 12 సంవత్సరాలు. కాంట్రాక్టు మొత్తం విలువ రూ.140 కోట్లు. ఏడాది కాలంలో ఈ బస్సులను ఏపీఎస్‌ఆర్‌టీసీకి అందిస్తామని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫేమ్‌-2 పథకం కింద ఈ 100 విద్యుత్తు బస్సులను తీసుకుంటున్నారు. తిరుమల- తిరుపతి మధ్య 50 బస్సులు, మిగిలిన 50 బస్సులను తిరుపతి నుంచి నెల్లూరు, కడప, మదనపల్లి పట్టణాలకు ఇంటర్‌సిటీ సర్వీసులుగా నడుపుతారు. తిరుపతిలోని అలిపిరి బస్సు డిపో నుంచి వీటిని నిర్వహిస్తారు. 9 మీటర్ల పొడవైన ఈ ఎయిర్‌ కండీషన్డ్‌ బస్సుల్లో డ్రైవర్‌తో పాటు 35 ప్రయాణికుల సీట్లుంటాయి. సీసీటీవీ, ఎమర్జెన్సీ స్విచ్‌, ప్రతి సీటుకు యూఎస్‌బీ సాకెట్‌.. తదితర సదుపాయాలు ఉంటాయి. ఈ బస్సులకు ఉండే లిథియమ్‌ ఆయాన్‌ బ్యాటరీలను ఒకసారి ఛార్జి చేస్తే, 180 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఏసీ/ డీసీ ఛార్జింగ్‌ సిస్టమ్‌తో బ్యాటరీలను 3 గంటల వ్యవధిలోనే తిరిగి ఛార్జింగ్‌ చేయవచ్చు.
ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఛైర్మన్‌ – ఎండీ కేవీ ప్రదీప్‌ స్పందిస్తూ, పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తులకు సేవలందించే అవకాశం తమకు లభించినందుకు ఎంతో సంతోషిస్తున్నట్లు తెలిపారు. శేషాచలం అడవులు, తిరుమల ఘాట్‌ రోడ్లో వాహన కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడటానికి విద్యుత్తు బస్సులు దోహదపడతాయని అన్నారు. ఇప్పటి వరకు తాము 400 విద్యుత్తు బస్సులను దేశవ్యాప్తంగా సరఫరా చేశామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌, ముంబయి, పుణె, నాగ్‌పుర్‌, సూరత్‌, డెహ్రాడూన్‌, సిల్వాసా, గోవాలతో పాటు హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలి, రోహ్‌తంగ్‌ పాస్‌ వంటి పర్వత ప్రాంతాల్లో కూడా సేవలందిస్తున్నట్లు చెప్పారు.