తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీ పుట్టింది_. మాజీ సీఎం చంద్రబాబు..

తెలుగు జాతి అభివృద్ధి కోసం ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చారని, తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీ పుట్టిందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. అతి తక్కువ సమయంలో అధికారంలోకి వచ్చిన పార్టీ తెదేపా అని గుర్తు చేశారు. ఆర్థిక అసమానతలు పోయే వరకు తెదేపా పనిచేస్తూనే ఉంటుందన్నారు. పాలనను పేదవాడి ఇంటిముందుకు తెచ్చి.. రాజకీయాలకు కొత్త ఆర్థం ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. స్థానిక సంస్థల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. తెలంగాణలో ఇరిగేషన్‌ అభివృద్ధికి, హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి నాంది పలికింది తెదేపా అని వివరించారు*.

రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు ఆదేశానుసారం తెదేపాలో చేరా. ఆయన ఆశీస్సులతో అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేశా. సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. రెండు రాష్ట్రాల నుంచి కార్యకర్తలు తరలివచ్చారు. పార్టీకి పూర్వవైభవం రావడానికి గ్రామగ్రామన తిరిగి కృషి చేద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెదేపా విజయం సాధించబోతోంది. మన నాయకుడు చేసిన అభివృద్ధి పనులు చెబుతూ ముందుకు సాగుదాం.బడుగు, బలహీన వర్గాల ప్రజలు తెదేపాకు అండగా ఉన్నారు’’అని కాసాని అన్నారు.