నేడు సోనియా, రాహుల్‌ సమక్షంలో తుమ్మల చేరిక…

అసెంబ్లీ ఎన్నికల ముంగిట అధికార బీఆర్‌ఎ్‌సకు పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ గూటికి చేరడం ఖాయమైంది.

శనివారం హైదరాబాద్‌కు వస్తున్న ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సీడబ్ల్యూసీ సమావేశాల ప్రారంభానికి ముందే మధ్యాహ్నం 2 గంటల సమయంలో తుమ్మల కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్లు పేర్కొన్నాయి.

తుమ్మలను కాంగ్రెస్ లోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు ఆధ్వర్యంలో అధిష్ఠానం గత కొంతకాలంగా సంప్రదింపులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, పీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విడివిడిగా తుమ్మల నివాసానికి వెళ్లి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు.

తుమ్మలతో సునీల్‌ కనుగోలు సంప్రదింపులు కొలిక్కి రావడంతో.. శుక్రవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి తదితర నేతలు హైదరాబాద్‌లోని తుమ్మల నివాసానికి వెళ్లి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆయనను లాంఛనంగా ఆహ్వానించారు.

శనివారం మంచిరోజైనందున సోనియాగాంధీ సమక్షంలో చేరిక కార్యక్రమం పెట్టుకుందామని వారు ప్రతిపాదించినట్లు, ఇందుకు తుమ్మల కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం…