రష్యా దాడిలో ప్రపంచపు అతిపెద్ద విమానం ధ్వంసం.

రష్యా చేస్తున్న దాడులు ఉక్రెయిన్‌లో భారీ నష్టానికి కారణమవుతున్నాయి. తాజాగా రష్యా దాడిలో ఉక్రెయిన్‌లో ఉన్న ప్రపంచ అతిపెద్ద విమానం ఏఎన్225 ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి డిమిట్రో కులేబా ప్రకటించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు సమీపంలోని హోస్టోమెల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం పార్క్ చేసి ఉండగా, రష్యా ప్రయోగించిన ఒక మిస్సైల్ విమానాన్ని తాకింది. దీంతో విమానం కొంతమేర ధ్వంసమైంది. కాగా, ఈ విమానం ఎంత వరకు ధ్వంసమైందో ఇప్పుడే చెప్పలేమని, సాంకేతిక బృందం విమానాన్ని పరిశీలిస్తోందని, ఆ తర్వాతే ఈ నష్టంపై ఒక అంచనాకు రాగలమని ఉక్రెయిన్ తెలిపింది. ఏఎన్ 225 విమానం పేరు ‘మ్రియా’. ఉక్రెయిన్ భాషలో దీనికి కల అని అర్థం.