ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభంలో కొత్త మలుపు. ..

ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభంలో కొత్త మలుపు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడమే తరువాయి అన్న వార్తలు వస్తున్న ప్రస్తుత తరుణంలో.. సైనిక మోహరింపులపై రష్యా కీలక ప్రకటన చేసింది. దాంతో ఉక్రెయిన్ పై యుద్ధమేఘాలు తొలగినట్టేనని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి…ఉక్రెయిన్‌ సరిహద్దు సమీపంలోని కొన్ని బలగాలను వెనక్కి రప్పిస్తున్నట్లు మంగళవారం రష్యా రక్షణశాఖ ప్రతినిధి ఇగోర్ కోనాషెంకొవ్ ప్రకటించారు. ఉక్రెయిన్ సమీపంలో మోహరించిన దక్షిణ, పశ్చిమ సైనిక యూనిట్లు కొన్ని బలగాలు తమ సైనిక కసరత్తులను పూర్తి చేశాయని, వెనక్కి తిరిగిరావడానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు..అయితే.. ఎంతమంది వెనక్కి వెళ్లనున్నారనేదానిపై స్పష్టత రాలేదు. మరోవైపు రష్యా ప్రకటనపై ఉక్రెయిన్‌ స్పందించింది. అమెరికాతో కలిసి తాము చేసిన దౌత్య ప్రయత్నాలతోనే రష్యా వెనక్కు తగ్గిందన్నారు.సరిహద్దు వెంబడి మిగిలిన బలగాలనూ రష్యా వెనక్కి రప్పించాలని ఉక్రెయిన్ డిమాండ్‌ చేసింది. కాగా.. రష్యాను నమ్మలేమని, బలగాల ఉపసంహరణను తాము ప్రత్యక్షంగా చూసినప్పుడే.. ఈ విషయాన్ని నమ్ముతామని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా స్పష్టం చేశారు.ఉక్రెయిన్ పై రష్యా దాడికి దిగుతుందని అమెరికా అంచనా వేసింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తమ ఎంబసీ అధికారులను వెనక్కు పిలిచింది. ఉక్రెయిన్ సమీప మిత్రదేశాల్లో అమెరికా సైన్యాన్ని మోహరించింది. అదే సమయంలో ప్రపంచ నాటో దేశాలతో కలిసి రష్యాపై ఒత్తిడి తెచ్చింది. యుద్ధానికి దిగితే కఠిన ఆర్థిక ఆంక్షలు విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రష్యా వెనుకడుగు వేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.