ఉక్రెయిన్ నుంచి భారత ప్రభుత్వ ఖర్చుతో స్వదేశానికి భారతీయులు !

రష్యా-ఉక్రెయిన్​ యుద్ధ భయాల కారణంగా భారత పౌరులను ఉక్రెయిన్​ నుంచి ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఉక్రెయిన్ గగనతలం మూసేయడంతో.. సమీప దేశాల నుంచి ఉక్రెయిన్​లోని భారత పౌరులను స్వదేశానికి తరలించనుంది ప్రభుత్వం.ఉక్రెయిన్​పై రష్యా సైనిక చర్య చేపట్టిన క్రమంలో ఆ దేశంలో వేలాది మంది భారత పౌరులు, విద్యార్థులు చిక్కుకుపోయారు.
సుమారు 20వేల మంది ఉంటారని అంచనా వేసింది ప్రభుత్వం. వారంతా బాంబుల మోతల మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తమను స్వదేశానికి తీసుకెళ్లాలని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. ఉక్రెయిన్​లోని భారతీయుల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని ప్రకటించిన కేంద్రం.. ఆ దిశగా చర్యలు చేపట్టింది. వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.
ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన భారత పౌరులు, విద్యార్థులకు అడ్వైజరీ జారీ చేసింది అక్కడి భారత రాయబార కార్యాలయం. రొమేనియా, హంగేరీ మీదుగా స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపింది. ఆయా సరిహద్దుల చెక్​పాయింట్ల వద్ద భారత బృందాలు ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అప్రమత్తంగా, భద్రంగా, ధృడంగా ఉండాలని సూచించింది. విదేశాంగ శాఖ బృందాల సమన్వయంతో సరిహ్దదులు దాటాలని స్పష్టం చేసింది. తమతో పాస్​పోర్టులు, నగదు సహా ఇతర అత్యవసర వస్తువులను తీసుకెళ్లాలని సూచించింది. అందుబాటులో ఉంటే కొవిడ్​-19 వ్యాక్సినేషన్​ ధ్రువపత్రం తీసుకెళ్లాలని కోరింది…