మ‌నం క‌లిసిక‌ట్టుగా పోరాడితే విజ‌యం సాధిస్తాం.., ఉక్రెయిన్ ప్ర‌తిష్ట‌ను కాపాడుకుందాం అంటు దేశాధ్య‌క్షుడు జెలెన్‌స్కీ తాజా వీడియో..

ర‌ష్యా బ‌ల‌గాలు ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌ను చుట్టుముట్టి దాడులు తీవ్ర‌త‌రం చేసిన నేప‌ధ్యంలో దేశాధ్య‌క్షుడు జెలెన్‌స్కీ తాజా వీడియోను విడుద‌ల చేశారు. మ‌నం క‌లిసిక‌ట్టుగా పోరాడితే విజ‌యం సాధిస్తామ‌ని, ఉక్రెయిన్ ప్ర‌తిష్ట‌ను కాపాడుకుందామ‌ని ప్ర‌జ‌ల‌కు ఈ వీడియోలో ఆయ‌న పిలుపు ఇచ్చారు. ర‌ష్యా మ‌న మౌలిక వ‌స‌తుల‌ను ధ్వంసం చేయ‌డం కొన‌సాగిస్తోందని, మ‌న న‌గరాల‌ను నాశ‌నం చేస్తోంద‌ని అయితే మ‌నం ప్ర‌తి న‌గ‌రాన్ని, ప్ర‌తి వీధినీ, ఇంటినీ పున‌ర్నిర్మించుకుందామ‌ని స్ప‌ష్టం చేశారు.ఆక్ర‌మ‌ణ‌దారు ఇప్ప‌టికీ మ‌న భూభాగంలో ఉన్నాడ‌ని మ‌నం దీటుగా ప్ర‌త్యర్ధిని దెబ్బ‌తీయాల‌ని పేర్కొన్నారు. మ‌న న‌గ‌రాలు, గ్రామాలు, మ‌న భూభాగాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ హృదయం, ఆత్మ‌ను ప‌రిర‌క్షించుకునేందుకు మ‌నం ఒక‌రికొక‌రు సాయం చేసుకోవాల‌ని పిలుపు ఇచ్చారు. ఉక్రెయినియ‌న్లంద‌రికీ బాస‌ట‌గా నిల‌వాల‌ని, మ‌న ర‌క్ష‌ణ విభాగానికి చేదోడుగా ఉండాల‌ని, దేశాన్ని కాపాడుకోవాల‌ని కోరారు.
మ‌రోవైపు ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం సోమ‌వారం 19వ రోజుకు చేరింది. రాజ‌ధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ర‌ష్య‌న్ బ‌ల‌గాలు న‌గ‌రం న‌లుమూల‌లూ చుట్టుముట్టాయి. ఇక మెలిట్‌పూల్ మేయ‌ర్‌ను ర‌ష్యా సైనికులు కిడ్నాప్ చేశారు. అమెరిక‌న్ జ‌ర్న‌లిస్ట్‌నూ కాల్చిచంపార‌ని క‌ధ‌నాలు వ‌చ్చాయి. మ‌రోవైపు లీవ్ సైనిక శిబిరంపై వైమానిక దాడుల్లో 35 మంది మ‌ర‌ణించారు.