కీవ్‌ సహా పలు నగరాల్లో బాంబుల మోత మోగిస్తున్న రష్యా…

ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం భీకర దాడులు 22వ రోజూ కొనసాగుతున్నాయి. ఓ వైపు శాంతి చర్చల్లో పురోగతి కనబడుతోందంటూనే రష్యా దాడులు కొనసాగిస్తోంది. కీవ్‌ సహా పలు నగరాల్లో బాంబుల మోత మోగిస్తున్న రష్యా సేనల దూకుడును ఉక్రెయిన్‌ బలగాలు దీటుగా ప్రతిఘటిస్తున్నాయి. గత మూడు వారాలకు పైగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 14వేల మందికి పైగా రష్యా సైనికుల్ని అంతం చేసినట్టు ఉక్రెయిన్‌ ప్రకటించింది. దీంతో పాటు రష్యాకు చెందిన 86 విమానాలు, 108 హెలికాప్టర్లు, 444 యుద్ధ ట్యాంకులు, 1435 సాయుధ శకటాలు, రెండు నౌకలు, 864కి పైగా వాహనాలు, 60 ఇంధన ట్యాంకులతో పాటు భారీ యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్‌ రక్షణశాఖ వెల్లడించింది.
*ఐసీజే ఆదేశాలూ పక్కకు !*
మరోవైపు, ఉక్రెయిన్‌పై తక్షణమే దాడులు నిలిపివేయాలంటూ అంతర్జాతీయ కోర్టు (ICJ) ఇచ్చిన ఆదేశాలను రష్యా తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని తాము పరిగణనలోకి తీసుకోలేమని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ తెలిపారు. ఈ తీర్పును అమలు చేసేందుకు రష్యా, ఉక్రెయిన్‌ రెండు దేశాలూ పరస్పరం అంగీకరించాల్సి ఉంటుందన్నారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు రష్యా చెబుతోంది. ఇందుకోసం తమ ప్రతినిధి బృందం భారీగా ప్రయత్నాలు చేస్తోందన్నారు. తమ ఒప్పందాలకు అంగీకరిస్తే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు తెరపడుతుందని తెలిపారు….