ఉక్రెయిన్ నుంచి రష్యా సైనికులు ఖాళీ..!!!

ఉత్తర ఉక్రెయిన్ నుంచి రష్యా సైనికులు ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి చెర్నిహైవ్ మధ్య డైరెక్ట్ లింకు రోడ్డును పునరుద్ధరించారు. ఈ విషయాన్ని ఆ ప్రాంత గవర్నర్ వియాచెస్లావ్ జాతీయ మీడియా టెలివిజన్ చానల్ లో ప్రకటించారు. అయితే యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు సురక్షితమని ఉక్రెయిన్ సైన్యం నిర్ధారించే వరకు వేచి ఉండాలని సూచించారు… ఉక్రెయిన్ ప్రజలపై రష్యా చేస్తున్న దాడులు దారుణమని మండిపడ్డారు అధ్యక్షుడు జెలెన్ స్కీ. ఇలాంటి అరాచకాలు రష్యా మరెక్కడా చేయకుండా చేయాలని అన్నారు. మనిషిలో ఉండకూడని లక్షణాలన్నీ రష్యా సైనికుల్లో కన్పిస్తున్నాయని.. వారికి హృదయం లేదని తెలిపారు. రష్యా చేసిన ప్రతి నేరంపైన విచారణ జరిపేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు జెలెన్ స్కీ. యుద్ధ విరమణ ఒప్పందంపై చర్చలకు రష్యా తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. బుచా సిటీలో జరిగిన ఘటనలు చూశాక రష్యాతో చర్చలు జరపడం కష్టమేనని అన్నారు జెలెన్ స్కీ.

అనవసర ఆరోపణలు సరికాదు… రష్యా...

ఉక్రెయిన్ ఆరోపణలన్నింటినీ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్​ ఖండించారు. ఉక్రెయిన్​ ప్రజలపై తాము ఎలాంటి అరాచకాలకు పాల్పడలేదని, అవన్నీ అబద్ధాలేనని సోమవారం ఐక్యరాజ్యసమితి స్పెషల్ ఎన్వాయ్ మార్టిన్ గ్రిఫిత్స్​తో సమావేశం సందర్భంగా చెప్పారు. ఇదంతా రష్యాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు చేస్తున్న ఆరోపణలనేనని ఆయన అన్నారు. యూఎన్ భద్రతా మండలిని అత్యవసరంగా సమావేశపరచాలంటూ రష్యా చేసిన విజ్ఞప్తిని.. ప్రస్తుతం భద్రతా మండలి చైర్​లో ఉన్న బ్రిటన్​ తోసిపుచ్చింది. అబద్ధాలు చెప్పేందుకు భద్రతా మండలిని రష్యా వాడుకుంటోందంటూ అమెరికా, బ్రిటన్​ మండిపడ్డాయి.