UNSCలో భారత్ కు శాశ్వత హోదా.. మద్దతు పలికిన రష్యా…

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడంపై రష్యా తన మద్దతును ప్రకటించింది. ఈ హోదా పొందడానికి భారత్‌తో పాటు బ్రెజిల్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపింది.అంతర్జాతీయంగా ఈ రెండు దేశాలు చాలా కీలకమైనవని ఆ దేశ విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్‌ పేర్కొన్నారు. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా భద్రతామండలి కూర్పులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం ఐరాస సర్వప్రతినిధి సభనుద్దేశించి ప్రసంగించిన సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాల ప్రాతినిధ్యాన్ని విస్తరించడం ద్వారా ఐరాస భద్రతా మండలిని మరింత ప్రజాస్వామ్యయుతంగా మార్చాల్సిన అవసరం ఉందని లావ్రోవ్‌ అన్నారు. మండలిలో తీసుకురావాల్సిన అత్యవసర మార్పులను ప్రతిపాదించడంలో భారత్‌ ముందు వరుసలో ఉంటూ వస్తోందన్నారు. ప్రస్తుతం భద్రతా మండలిలో రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్‌, అమెరికా శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి. మరో 10 తాత్కాలిక శాశ్వత సభ్యదేశాలుగా వ్యవహరిస్తాయి. వీటిని ప్రతి రెండేళ్లకోసారి ఐరాస సర్వప్రతినిధి సభ ఎన్నుకుంటుంది. సమకాలీన ప్రపంచానికి సరైన ప్రాతినిధ్యం లభించాలంటే మరికొన్ని దేశాలకు శాశ్వత సభ్యత హోదాను విస్తరించాల్సిన అవసరం ఉందని గత కొన్నేళ్లుగా వివిధ దేశాల నుంచి డిమాండ్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం భారత్‌ తాత్కాలిక శాశ్వత సభ్యదేశంగా కొనసాగుతోంది. డిసెంబరుతో గడువు ముగియనుంది.