_తోపుడు బండి వ్యాపారికి తుపాకులతో బాడీగార్డుల రక్షణ!.

*_ఉత్తరప్రదేశ్‌లో తోపుడు బండిపై వస్త్రాలు విక్రయించే వ్యక్తికి ఇద్దరు బాడీగార్డులు తుపాకులతో రక్షణ కల్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోజుకు రూ.200-300 సంపాదించే ఆ తోపుడు బండి యజమానికి బాడీగార్డుల రక్షణ వెనక పెద్ద కథే ఉంది. ఆయన పేరు రామేశ్వర్ దయాళ్. ఎటా జిల్లాకు చెందిన ఆయన తోపుడు బండిపై వస్త్రాలు విక్రయిస్తూ జీవిస్తున్నాడు. రామేశ్వర్ ఇటీవల ఎస్పీ నేత, మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్‌సింగ్ సోదరుడు జుగేంద్రసింగ్‌ను కలిసి తన భూమికి పట్టా ఇప్పించాలని కోరాడు…ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. జుగేంద్ర తనను కులం పేరుతో దూషించారంటూ రామేశ్వర్ దయాళ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై జుగేంద్ర హైకోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టుకు హాజరుకావాలంటూ రామేశ్వర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఒంటరిగా కోర్టుకు వచ్చిన రామేశ్వర్‌ను చూసిన కోర్టు.. అతడికి భద్రత ఎందుకు కల్పించలేదని పోలీసులను ప్రశ్నించింది. ఆయనకు వెంటనే ఇద్దరు బాడీగార్డులను నియమించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు రామేశ్వర్‌కు ఇద్దరు గార్డులను నియమించింది. వారిద్దరూ ఏకే 47 రైఫిళ్లతో ఆయనకు రక్షణగా ఉన్నారు._*