అపర్ణా యాదవ్‌ ట్విటర్‌లో షేర్‌ చేసిన ఫొటోపై ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ..

ములాయం సింగ్‌ యాదవ్‌ చిన్న అపర్ణా యాదవ్‌ ట్విటర్‌లో షేర్‌ చేసిన ఫొటోపై ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ములాయం ఆశీస్సులు తీసుకున్న ఫొటోను శుక్రవారం ఆమె ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘బీజేపీలో చేరిన తర్వాత లక్నోలో మా నాన్న/నేతాజీ ఆశీస్సులు తీసుకున్నాను’ అని క్యాప్షన్‌ జోడించారు. దీనిపై ఓ నెటిజన్‌ ఆసక్తికర కామెంట్‌ చేశారు. ‘అంటే దీనర్థం నేతాజీ (ములాయం సింగ్ యాదవ్) కూడా బీజేపీ గెలవాలని కోరుకుంటున్నార’ని వ్యాఖ్యానించారు.
అపర్ణా యాదవ్‌.. గురువారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీనిపై అఖిలేశ్‌ యాదవ్‌ స్పందిస్తూ.. ‘వారసత్వ భారాన్ని తగ్గించినందుకు బీజేపీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఆమెను బీజేపీకి వెళ్లకుండా వారించేందుకు తన తండ్రి ములాయం సింగ్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ములాయం సింగ్ యాదవ్ తోడల్లుడు మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ గుప్తా గురువారం బీజేపీలో చేరడం గమనార్హం.