రాష్ట్రంలోని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో పని చేసిన చోటే 7,305 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల విధులు నిర్వర్తించనున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని ఇప్పటికే సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇవాళ్టి నుంచే ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా అధికారులకు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2007 ఫిబ్రవరిలో 7,561 మంది ఫీల్డ్ అసిస్టెంట్లని ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది. అప్పట్లో రూ.1,200 జీతంతో విధుల్లోకి వచ్చిన వారికి కొద్ది నెలల్లోనే రూ. 10వేల జీతాలు ఇచ్చింది.
ప్రభుత్వం మళ్లీ విధుల్లోకి తీసుకోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అనేక చోట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చిత్ర పటాలకు పాలాభిషేకాలు చేశారు. ఉపాధి హామీ కూలీల మస్టర్ రోల్స్ రాయడం, వారి పనులను పర్యవేక్షించడం వంటి పనులు చేశారు. తర్వాత జాబ్ కార్డులు ఉన్నవాళ్ళల్లో సాధ్యమైనంత ఎక్కువమందిని ఉపాధికి వచ్చేవిధంగా చూడాలని, విధుల్లో తప్పనిసరిగా ఉండాలని అధికారులు ఆదేశించారు.
ఇదే సమయంలో తమకు జీతాలు ఎస్టీఓల నుంచి ఇవ్వాలని, తమను పర్మినెంట్ చేయాలని ఇంకొన్ని డిమాండ్లతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం తేదీ 2021, మార్చి 18న ఫీల్డ్ అసిస్టెంట్లను తాత్కాలికంగా పక్కన పెట్టింది. కాగా, అప్పటి నుండి 28 నెలలుగా ఫీల్డ్ అసిస్టెంట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఇదే విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి సీఎం దృష్టికి తీసుకెళ్ళారు. ముఖ్యమంత్రి ఈ నిర్ణయానికి కట్టుబడి వారిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు.
మరోవైపు ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా తాము వెంటనే విధుల్లో చేరుతామని ప్రకటిస్తూ సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చిత్ర పటాలకు పాలాభిషేకాలు చేశారు. ఈ సమస్యపై కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో 28 నెలల ఫీల్డ్ అసిస్టెంట్ల ఎదురు చూపులు ఫలించాయి.