యూరియా కోసం అన్నదాతల గోస పడుతున్నారు.. ప్రభుత్వం ముందుచూపు లేని కారణంగా వ్యవసాయ పనుల్లో ఉండాల్సిన రైతులు ఎరువు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా కుటుంబాలతో సహా సొసైటీల వద్దే గడుపుతున్నారు. సాగు చేయడం కంటే యూరియా సాధించడ మే కష్టంగా మారిందని సర్కారు తీరుపై మండిపడుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి మహబూబాబాద్లోని సొసైటీ ఎదుట పడిగాపులు గాచిన రైతులకు ఎవరూ సమాధానం చెప్పేవారు లేక ఆగ్రహంతో ఎమ్మెల్యే మురళీనాయక్ క్యాంపు ఆఫీస్ ముట్టడికి యత్నించారు..ఐదు రోజుల క్రితం టోకెన్లు ఇచ్చినా యూరియా మాత్రం ఇవ్వడం లేదని శుక్రవారం మహబూబాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున సొసైటీ వద్దకు చేరుకున్నారు. సొసైటీలో ఒక్క యూరియా బస్తా కూడా లేదని అధికారులు సొసైటీకి తాళం వేసి వెళ్లిపోయారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు సొసైటీ వద్దే పడిగాపులు గాశారు. ఆగ్రహంతో మహబూబాబాద్- తొర్రూరు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే మురళీనాయక్ లోకల్లో ఉన్నాడని తెలుసుకొని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరారు. పోలీసులు గేటు వద్ద అడ్డుకోవడంతో రైతులకు వారికి తోపులాట జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది. ఎమ్మెల్యేతో మాట్లాడాలని రైతులు ఎంత చెప్పినా పోలీసులు మాత్రం లోపలకు పంపించలేదు.
ఈ క్రమంలో కొంతమంది మహిళా రైతులు లోపలకు వెళ్లే ప్రయత్నం చేయగా, మహిళా కానిస్టేబుళ్లు అడ్డుకొని వారిని బయటకు పంపించారు. ఎమ్మెల్యే వెంటనే బయటకు రావాలని, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ గేటు ఎదుట నినాదాలు చేశారు. అనంతరం అక్కడకు చేరుకున్న మండల వ్యవసాయ అధికారికి రైతులు తమ సమస్యలను వివరించారు. పోలీసులు, వ్యవసాయ అధికారులు రైతులకు సర్ది చెప్పి వారి ఆధార్కార్డ్లు తీసుకొని, రేపు యూరియా లోడ్ రాగానే అందరికీ ఇస్తామని చెప్పి పంపించారు. నర్సింహులపేట మండలంలోని పీఏసీఎస్ కార్యాలయానికి మూడు రోజులుగా యూరియా బస్తాలు రాకపోవడంతో మండలంలోని వివిధ గ్రామాల రైతులు వ్యవసాయ పనులు వదులుకొని, తిండీతిప్పలు మాని అక్కడే పడిగాపులుగాస్తున్నారు.
కనీసం ఎప్పుడు వస్తుందో అధికారులు చెప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలోని రాజరాజేశ్వరి ఫర్టిలైజర్ గోదాముకు శుక్రవారం యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి లైన్లో నిలబడ్డారు. ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం తరిగొప్పుల మండల మాజీ అధ్యక్షుడు ముక్కెర బుచ్చిరాజు యాదవ్ మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన యూరియాను సకాలంలో అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందన్నారు…