రాష్ట్రానికి రావాల్సినవి రాకుండా చేశారు: ఉత్తమ్‌.

రాష్ట్రానికి రావాల్సినవి రాకుండా చేశారు: ఉత్తమ్‌

నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నాయకులందరూ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేయాలన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన బాధ్యత తెలంగాణ సమాజానికి ఉందని ఉత్తమ్‌ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఉత్తమ్‌ మాట్లాడారు. తెరాస పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయని ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. భాజపా నాయకులు తెలంగాణ కోసం ఎన్నడూ మాట్లాడలేదని ఉత్తమ్‌ ఆరోపించారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన బయ్యారం స్టీల్‌ పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ లాంటివి రాష్ట్రానికి రాకుండా చేశారని విమర్శించారు. తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అవినీతి సొమ్ముతో ఓట్లను కొనాలని చూస్తున్నారని.. కాంగ్రెస్‌ గట్టిగా పోరాడి గెలుపును కైవసం చేసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.